కోవిడ్ లక్షణాలతో ఉన్నవారిని గుర్తించండి..


Ens Balu
1
Srikakulam
2021-05-30 08:06:32

శ్రీకాకుళం  జిల్లాలో కరోనా లక్షణాలు ఉన్న వారిని గుర్తించుటకు ప్రత్యేక డ్రైవ్ ను సోమవారం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ ఆదేశించారు. ఆదివారం మండల ప్రత్యేక అధికారులు, మండల అధికారులు, వైద్య అధికారులతో నిర్వహించిన టేలి కాన్ఫరెన్స్ లో కరోనా లక్షణాలు ఉన్న వారిని గుర్తించడంపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. లక్షణాలతో ఉన్న ప్రతి ఒక్కరిని గుర్తించాలని, ఈ మేరకు వాలంటీర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, క్షేత్ర సహాయకులు తదితర గ్రామస్థాయి నిర్వాహకులతో సమావేశం నిర్వహించాలని ఆయన ఆదేశించారు. ప్రాధాన్యత క్రమంలో దీన్ని చేపట్టి జిల్లాలో తగ్గుముఖం పడుతున్నా కరోనా కేసులను పూర్తిగా రూపుమాపేందుకు సహకరించాలని కోరారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని అనుకూలంగా మార్చుకుని జిల్లాను ఆరోగ్య దిశగా తీసుకు వెళ్లాలని అన్నారు. ప్రజల్లో అవగాహన వచ్చిందని, మరింత అవగాహన పెంచాలని ఆయన సూచించారు. గత నాలుగు రోజులుగా జిల్లాలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారని పేర్కొంటూ ఇందుకు కృషి చేసిన మండల ప్రత్యేక అధికారులు, మండల అధికారులు, వైద్య అధికారులు, సిబ్బందికి జిల్లా కలెక్టర్ ప్రశంసించారు. ఇదే స్ఫూర్తితో కరోనాను పారద్రోలాలని ఆయన కోరారు. ప్రస్తుత వివాహ వేడుకల సీజన్లో వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న వివాహ వేడుకలను అధికారులు తనిఖీ చేసి చర్యలు చేపడుతున్నారని ఆయన అభినందించారు. పాతపట్నం మండలంలో ఒక వివాహ వేడుకను తనిఖీ చేసి అపరాధ రుసుము విధించడం పట్ల పాతపట్నం తాసిల్దార్ కాళీ ప్రసాద్ కు, పాలకొండ రెవిన్యూ డివిజనల్ అధికారి కుమార్ కు ఆయన అభినందించారు. వేడుకలలో ఎక్కువ మంది పాల్గొనడం వలన కరోనా వ్యాప్తి జరుగుతుందని ప్రజలు గుర్తించాలని ఆయన అన్నారు.

 ఆలయాల్లో కేవలం అర్చకులు మాత్రమే నిత్య పూజాది కార్యక్రమాలు నిర్వహించాలని,  భక్తులకు ప్రవేశం లేదని ఆయన స్పష్టం చేస్తూ వివిధ ఆలయాలను పరిశీలించాలని అన్నారు.  గ్రామాల్లో ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ పేర్కొంటూ జిల్లాలో ఇప్పటి వరకు 1049 కేంద్రాలను గుర్తించి 733 పడకలను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ప్రస్తుతం 38 మంది కరోనా బాధితులు గ్రామ కేంద్రాల్లో సేవలు పొందుతున్నారని ఆయన చెప్పారు. ఈ కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె.శ్రీనివాసులు, జిల్లా పంచాయతీ అధికారి వి.రవికుమార్, మండల ప్రత్యేక అధికారులు, మండల అధికారులు, వైద్య అధికారులు తదితరులు పాల్గొన్నారు.