విశాఖలోని సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామివారి దేవస్థానంలో జూన్ 1 నుంచి సింహాద్రి అప్పన్న లడ్డూ ప్రసాద విక్రయాలు ప్రారంభించనున్నట్టు ఆలయ ఈఓ ఎంవీ సూర్య కళ తెలియజేశారు. ఆదివారం ఈ మేరకు ఆమె దేవస్థానంలో మీడియాతో మాట్లాడారు. కోవిడ్-19 వల్ల కొన్ని రోజులుగా ప్రసాదం, లడ్డూల విక్రయం నిలిపివేశామని, కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా వాటిని తయారు చేసి మళ్లీ భక్తులకు అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలియజేశారు. క్యూ లైన్లలో జాగ్రత్తలు తీసుకుని ఆలయం తెరిచి ఉన్న సమయంలో వాటిని భక్తులకు అందుబాటులో ఉంచుతామన్నారు. సింహాద్రి అప్పన్న ప్రసాదాన్ని భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారని అలాంటిది కోవిడ్ వల్ల దానికి నోచుకోలేకపోతున్నామని భక్తులు చేసిన విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. లడ్డూ కౌంటర్ దగ్గర కూడా కోవిడ్ నిబంధనలు అమలు చేస్తామన్నారు. మాస్కులేని వారికి ప్రసాదాలు విక్రయించేది లేదని ఈఓ తెలియజేశారు.