జనరంజక పాలనే YSRCP ప్రభుత్వ లక్ష్యం..


Ens Balu
1
Kakinada
2021-05-30 10:47:05

అందరికీ సమన్యాయం చేస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను అందిస్తోందని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. సంక్షేమ పాలనకు రెండేళ్లు సందర్భంగా ఆదివారం కాకినాడ రమణయ్యపేటలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మంత్రి కురసాల కన్నబాబు, కాకినాడ ఎంపీ వంగా గీత, ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి కురసాల కన్నబాబు మీడియా సమావేశంలో రెండేళ్ల కాలంలో ప్రభుత్వం చేపట్టిన పథకాలు, కార్యక్రమాల వివ‌రాల‌ను వెల్ల‌డించారు. రెండేళ్ల కాలంలో సంచలనాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.83 వేల కోట్లను రైతులకు నేరుగా అందించి, రికార్డు సృష్టించిందన్నారు. పథకాల ఫలాలు పొందడానికి ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేకుండా వాలంటీర్; గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థల‌ ద్వారా ప్రజలకు ఇంటివద్దకే సంక్షేమ పాలన అందుతోందని పేర్కొన్నారు. వివిధ పథకాల కింద లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా రూ.1,25,000 కోట్లకు పైగా జమచేయగా.. ఎక్కడా రూపాయి అవినీతి అనేది జరగలేదన్నారు. కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను పోగొట్టుకున్న చిన్నారులకు రూ.10 లక్షల డిపాజిట్ చేసే కార్యక్రమాన్ని ఇటీవల ప్రారంభించగా.. ఈ కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకొని కేంద్రం కూడా చిన్నారుల సంక్షేమానికి విధానాలు ప్రకటించిందని తెలిపారు. పూర్తి పారదర్శకత, జవాబుదారీతనంతో సంక్షేమ పథకాలను అమలుచేస్తూ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని చెప్పడానికి ఇదో ఉదాహరణ అని పేర్కొన్నారు. 

 సోమవారం రాష్ట్రంలో 16 మెడికల్ కళాశాలలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారని, ఈ కాలేజీలు అందుబాటులోకి వస్తే వైద్య సిబ్బందికి కొరత అనే మాట ఉండదని మంత్రి పేర్కొన్నారు. వచ్చే మూడేళ్లకాలంలో రూ.14 వేల కోట్ల ఖర్చుతో వ్యవసాయ రంగానికి అవసరమైన మౌలిక వసతులను ఏర్పాటుచేయనున్నట్లు ప్రకటించారు. గ్రామాల్లో గోదాములు, కోల్డ్ స్టోరేజ్‌లు, బల్క్ మిల్క్ కూలింగ్ కేంద్రాలు, కస్టమ్ హైరింగ్ కేంద్రాలు వంటివి అందుబాటులోకి వస్తాయన్నారు. కాకినాడ గ్రామీణ నియోజకవర్గంలో ఉప్పలంక వద్ద ఫిష్ ల్యాండింగ్ కేంద్రం రానుందని ప్రకటించారు. నాడు-నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి మండలంలోనూ రెండు పీహెచ్‌సీలు ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాల (సీహెచ్‌సీ)ను కూడా బలోపేతం చేసేందుకు ప్ర‌ణాళిక‌లు రూపొందించి, అమ‌లుచేస్తోంద‌న్నారు. ఈ విధంగా విద్య, వైద్యం, వ్యవసాయం వంటి రంగాలతో పాటు సంక్షేమానికి కూడా పెద్దపీట వేస్తూ ప్రభుత్వం పాలన సాగిస్తోందని స్పష్టం చేశారు. అభివృద్ధి అంటే కేవలం నిర్మాణాలు కాదని.. ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదగడం అభివృద్ధి అని భావించి ప్రభుత్వం వివిధ కార్య‌క్ర‌మాల‌ను అమ‌లుచేస్తోంద‌ని వివ‌రించారు. ఇదంతా గౌరవ ముఖ్యమంత్రి దార్శనికతకు నిదర్శనమని పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రాలు మొదలు విశ్వవిద్యాలయాల వరకు ప్రతి దాంట్లోనూ అత్యుత్తమ ప్రమాణాలు నెలకొల్పి, ప్రతి రంగంలోనూ అద్భుతమైన పనితీరుతో ప్రభుత్వం రాష్ట్రాన్ని ముందువరుసలో నిలిచేలా చేసిందని మంత్రి వెల్లడించారు.

నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు పథకం కింద 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు అందించి, తొలిదశలో 15 లక్షల ఇళ్లను మంజూరు చేసి.. ప్రతి పేదవానికి సొంత ఇంటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం కృషిచేస్తోందని మంత్రి పేర్కొన్నారు. వేల కోట్ల రూపాయలు వెచ్చించి, ప్రైవేటు స్థలాలను సైతం సేకరించి ఎక్కడా ఎలాంటి సాంకేతికపరమైన సమస్యలు లేకుండా ఇళ్ల పథకాన్ని అమలు చేస్తున్నట్లు వివరించారు. ఇంకా అర్హత ఉన్నవారు ఎవరైనా ఉంటే సచివాలయంలో దరఖాస్తు చేసుకుంటే 90 రోజుల్లోనే పట్టా మంజూరవుతుందన్నారు. కాకినాడ గ్రామీణ నియోజకవర్గంలో కరప, కాకినాడ గ్రామీణ మండలాల్లో సంక్షేమ పథకాల ద్వారా రెండు లక్షలకు పైగా కుటుంబాలకు రూ.146.44 కోట్ల మేర లబ్ధి చేకూరినట్లు తెలిపారు. నియోజ‌క‌వ‌ర్గంలో రూ.190 కోట్లకు పైగా ఖ‌ర్చుతో అభివృద్ధి పనులు చేప‌ట్టిన‌ట్లు వెల్ల‌డించారు. కోవిడ్ విపత్తు సమయంలోనూ ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని ఆపకుండా, లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చుతున్నట్లు మంత్రి కురసాల కన్నబాబు వెల్లడించారు. మున్ముందు ఇలానే పనిచేస్తూ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను అగ్రగామిగా నిలిపేందుకు ప్రభుత్వం  కృషిచేయనున్నట్లు తెలిపారు.

ఇత‌ర రాష్ట్రాల‌కు ఆద‌ర్శం: ఎంపీ వంగా గీత‌
కాకినాడ ఎంపీ వంగా గీత మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. పథకాలు ప్రారంభించడమే కాకుండా.. ఆ పథకాలను అమలుచేస్తున్న తీరు ఇతర రాష్ట్రాల ప్రజలను సైతం  ఆకట్టుకుంటోందన్నారు. ప్రభుత్వ వ్యవస్థలను పటిష్టం చేయడంతో పాటు పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించేందుకు ప్రత్యేకంగా వాలంటీర్, గ్రామ సచివాలయ వ్యవస్థలను ప్రవేశపెట్టారన్నారు. వైద్య శాలల అభివృద్ధికి ప్రభుత్వం కృషిచేస్తున్నట్లు ఎంపీ వంగా గీత పేర్కొన్నారు.

విప్ల‌వాత్మ‌క మార్పుల‌కు కృషి: ఎమ్మెల్సీ పండుల ర‌వీంద్ర‌బాబు
ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు మాట్లాడుతూ ఇలాంటి ముఖ్యమంత్రి మనకు ఉండటం గొప్ప అదృష్టమని పేర్కొన్నారు. కోవిడ్ విపత్తు సమయంలో మనం సురక్షితంగా ఉండగలుగుతున్నామంటే ఆయన ఉన్నార‌నే భ‌రోసానే కార‌ణ‌మ‌ని వ్యాఖ్యానించారు. విద్య, ఆరోగ్యం ప్రాధాన్యతను గుర్తించి, ఈ రంగాల్లో విప్లవాత్మక మార్పులకు ప్రభుత్వం కృషిచేసిందన్నారు. వాలంటీర్, సచివాలయ వ్యవస్థ ఉండటంల వల్ల కోవిడ్‌ను సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతున్నామని ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు పేర్కొన్నారు.
సిఫార్సు