పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో జిల్లాలోని ఇళ్లులేని నిరుపేద కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణాన్ని జూన్ 3వ తేదీన శ్రీకారం చుట్టనున్నట్టు జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ వెల్లడించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి వర్చ్యువల్ విధానంలో వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రారంభిస్తారని తెలిపారు. గజపతినగరం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని బొండపల్లి మండలం గొట్లాంలో జగనన్న హౌసింగ్ కాలనీల ఏర్పాటులో భాగంగా రూపొందించిన ఇళ్ల స్థలాల లే అవుట్‌లో ఇళ్ల నిర్మాణ పనులను ముఖ్యమంత్రి ఆన్ లైన్‌లో ప్రారంభిస్తారని పేర్కొన్నారు. ఈ లే అవుట్‌లో 185 ఇళ్ల నిర్మాణం పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. జగనన్న కాలనీ ఏర్పాటులో భాగంగా జిల్లా వ్యాప్తంగా 928 లే అవుట్లను అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ, గ్రామీణ నీటిసరఫరా, విద్యుత్ పంపిణీ సంస్థల ఆధ్వర్యంలో ఇప్పటికే ఈ కాలనీల్లో ఇళ్ల నిర్మాణానికి వీలు కల్పించేలా నీటివసతి కల్పించేందుకు బోర్ల తవ్వకం, అంతర్గత రోడ్ల నిర్మాణం, విద్యుత్ సరఫరా లైన్ల ఏర్పాటు వంటి సౌకర్యాలు కల్పించడం వంటి మౌళిక సదుపాయాల పనులు ముమ్మరంగా చేపట్టడం జరుగుతోందని తెలిపారు.
జిల్లాలో తమ సొంత స్థలాల్లో ప్రభుత్వ అందించే రూ.1.80 లక్షల ఆర్ధిక సహాయంతో ఇళ్లు నిర్మించుకొనేందుకు ముందుకు వచ్చిన వారితో, అదేవిధంగా ప్రభుత్వం జిల్లాలో అభివృద్ధి చేసిన 928 జగనన్న హౌసింగ్ కాలనీల లేఅవుట్లలో ప్రభుత్వం అందించే సహాయం వినియోగించుకొని తమంతట తాముగా ఇళ్లు నిర్మించుకొనే వారితో ముందుగా ఇళ్లనిర్మాణాలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు గృహనిర్మాణసంస్థ జిల్లా ప్రాజెక్టు డైరక్టర్ ఎస్.వి.రమణమూర్తి తెలిపారు. జిల్లాలో తొలివిడతగా 98,286 ఇళ్లను మంజూరు చేయడం జరిగిందని ప్రాజెక్టు డైరక్టర్ చెప్పారు.