రభీ ధాన్యానికి మద్దతు ధర కల్పిస్తాం..


Ens Balu
3
Kakinada
2021-05-31 13:20:56

రబీ ధాన్యానికి మద్దతు ధర కల్పించేందుకు అన్ని చర్యలు చేపట్టామని, దళారులు, ఏజెంట్ల మాయ మాటలు నమ్మి రైతులెవరూ ఆందోళన, నిరాశలతో తక్కువ ధరకు తమ ధాన్యం అమ్మి నష్ట పోవద్దని  జిల్లా కలెక్టర్ డి.మురళీధరరెడ్డి కోరారు.  సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ మురళీధరరెడ్డి జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీడియా ప్రతినిధులతో సమావేశం నిర్వహించి జిల్లాలో రైతుల రబీ ధాన్యానికి మద్దతు ధర కల్పించేదుకు, దళారుల బారి నుండి కాపాడేందుకు చేపట్టిన చర్యలను వివరించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల రబీ ధాన్యానికి ఏ గ్రేడు రకానికి క్వింటాలుకు 1888 రూపాయలు ( 75 కేజీల బస్తాకు 1416 రూపాయలు), కామన్ రకానికి క్వింటాలుకు 1868 రూపాయలు (75 కేజీల బస్తాకు 1401 రూపాయలు) చొప్పున మద్దతు ధరను ప్రకటించిందని, జిల్లాలో రైతులందరూ తమ ధాన్యానికి ఈ కనీస మద్దతు ధరలు పొందేలా అన్ని చర్యలు చేపట్టామన్నారు.   రైతులెవరు దోపిడి చేసేందుకు ద‌ళారులు, క‌మిష‌న్ ఏజెంట్లు ప్రచారం చేసే వదంతుల‌ను నమ్మవద్దని , ముఖ్యంగా బోండాలు (ఎంటీయూ 3626) ర‌కం పండించిన రైతులు ఆందోళ‌న‌తో ఎంఎస్‌పీ కంటే త‌క్కువ ధ‌ర‌కు అమ్ముకోవ‌ద్ద‌ని, ఏవైనా సందేహాలుంటే వెంట‌నే రైతు భ‌రోసా కేంద్రాల‌ను, హెల్ప్ లైన్ ను సంప్ర‌దించాల‌ని సూచించారు.  ప్ర‌స్తుతం జిల్లాలో 375 ధాన్యం కొనుగోలు కేంద్రాలు, 865 రైతు భరోసా కేంద్రాలు ప‌నిచేస్తున్నాయ‌ని.. వీటిని 400 రైస్ మిల్లుల‌తో అనుసంధానించిన‌ట్లు తెలిపారు. సొంత వినియోగం పోనూ  సుమారు 11 లక్షల ధాన్యం మార్కెట్ కు వస్తుందని అంచనా కాగా,  ఇప్పటి వరకూ రైతుల నుండి 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయడం జరిగిందని, ఇందులో దాదాపు 2.25 లక్షలు టన్నులు బొండాల రకం ధాన్యమే ఉందన్నారు.  రైతుల నుండి 852 కోట్ల 91 లక్షల విలువైన ధాన్యాన్ని పిపిసిల ద్వారా కొనుగోలు చేసి, ఇప్పటికే 255 కోట్ల 35 లక్షల మొత్తాన్ని వారి ఖాతాలకు జమచేశారన్నారు.  ఎక్కువ ధాన్యం గత వారంలోనే కొనుగోలు చేసారని, రానున్న  వారం, 10 రోజుల్లో మొత్తం సొమ్ము చెల్లింపు పూర్తి కానుందన్నారు.
         రైతుల పండించిన ప్రతి గింజకు కనీస మద్దతు ధర కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం అవసరమైన అన్ని చర్యలు చేపట్టడం జరిగిందని, రైతులెవరూ దళారులు, కమీషన్ ఏజెంట్ల మోసపూరిత మాటలు, వదంతులను నమ్మి నష్టపోవద్దని జిల్లా కలెక్టర్ కోరారు.  రైతులను ఎవ్వరైనా తప్పుద్రోవ పట్టించేందుకు ప్రయత్నించినా, తక్కవ ధరకు అమ్మాలని నిర్బంధించినా అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు చేపడతామని కలెక్టర్ హెచ్చరించారు. అటువంటి వారి నుండి ఏ విధమైన సమస్య ఎదురైనా రైతలు వెంటనే రైతు భరోసా కేంద్రాలకు గానీ, జిల్లా స్థాయిలో 8886613611 హెల్ప్ లైన్ నెంబరుతో ప్రతి రోజూ ఉదయం 6 నుండి రాత్రి 6 గంటల వరకూ పనిచేసేలా ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ కు సమాచారం అందించాలని సూచించారు.  ఇప్పటి వరకూ 450 మంది రైతులు ఈ  హెల్ప్ లైన్ సేవలను వినియోగించుకోవడం జరిగిందన్నారు. 
సమావేశంలో జాయింట్ కలెక్టర్  డా.జి.లక్ష్మీశ మాట్లాడుతూ జిల్లాలో ధాన్యం విక్రయానికి 97,824 మంది రైతులు ఆన్ లైన్  నమోదు చేయించుకున్నారని,  రైతులు తమ ధాన్యాన్ని నిర్థేశి ప్రమాణంలోపు తేమను నియంత్రించేలా బాగా ఆరబెట్టుకుని, తప్ప, తాళు లేకుండా సగటు నాణ్యత ఉండేలా శుబ్ర పరచు కొవాలని కోరారు.  అమలాపురం ఏరియాలో ప్రస్తుతం పంట కోతలు జరుగుతున్నాయని, రుతుపవన రాకతో వర్షాలు ప్రారంభం కానున్న దృష్ట్యా ధాన్యం తడవ కుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. 

సిఫార్సు