మహావిశాఖనగర పాలక సంస్థ పరిధిలోని ప్రజలంతా వారానికి ఒక రోజు డ్రైడే పాటించడం ద్వారా వ్యాధులను నియంత్రించడానికి వీలుపడుతుందని జివిఎంసీ కమిషనర్ డా.జి.స్రిజన పిలుపునిచ్చారు. సోమవారం మూడవ జోన్ 24వ వార్డు నక్కవాని పాలెం ప్రాంతంలో కమిషనర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె స్థానిక ప్రజలతో మాట్లాడుతూ రానున్న వర్షా కాలాన్ని దృష్టిలో పెట్టుకొని సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకొవాలని, ఇళ్ళలో వాడే నీటికుండీలను ప్రతీ రెండు రోజులకు ఒక్కసారి నీటిని మార్చాలని, నీరు ఎక్కువ రోజులు నిల్వ ఉంచకూడదని, కొబ్బరిబొండాలు, ప్లాస్టిక్ వంటి వస్తువులు ఇంటి పరిసరాలలో ఉండకుండా చూడాలని, ప్రతీ ఒక్కరూ ప్రతీ శుక్రవారం “డ్రై” డే గా పాటించాలని సూచించారు. ఇంటి ముందు ఉన్న కాలువలకు అడ్డంగా రాళ్ళను పెట్టడం వలన నీరు నిల్వ ఉంటుందని వాటిని వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఎవరైనా కాలువలకు అడ్డంగా రాళ్ళు, జాలీలు లాంటివి పెట్టినట్లయితే ఆ ఇంటి నుండి అపరాధ రుసుం వసూలు చెయాలని ప్రధాన వైధ్యాదికారిని ఆదేశించారు. రోడ్లను, కాలువలను ప్రతీ రోజు శుభ్రం చేయాలని, ఎక్కడా చెత్త కనిపించకూడదని, చెత్తను ఎప్పటికప్పుడు డంపింగు యార్డుకు తరలించాలని శానిటరి ఇన్స్పెక్టర్ ను ఆదేశించారు. ప్రతీ రోజు పారిశుధ్య సిబ్బంది డోర్ టు డోర్ చెత్త సేకరించాలని, తడి-పొడి చెత్తను వేరు వేరుగా తీసుకోవాలని, బహిరంగ ప్రదేశాలలో చెత్త వేయకుండా చూడాలని పారిశుధ్య సిబ్బందిని ఆదేశించారు. గృహ నిర్మాణ వ్యర్ధాలను వెంటవెంటనే తొలగించాలని, వ్యర్ధాలు తొలగించని యడల గృహ యజమానికి అపరాధ రుసుం వసూలు చేయాలని ఆసిస్టంట్ సిటీ ప్లానర్ ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, జోనల్ కమిషనర్ శ్రీనివాస్, కార్య నిర్వాహక ఇంజినీరు చిరంజీవి, ఆసిస్టంట్ సిటీ ప్లానర్ ప్రసాద బాబు, ఎఎంఒహెచ్ రమణ మూర్తి, శానిటరి సూపర్వైజర్ జనార్ధన్, శానిటరి ఇన్స్పెక్టర్ తదితరులు పాల్గొన్నారు.