విశాఖ జిల్లాలో కరోనా కేసులు తగ్గుతున్నాయని, అయినప్పటికి ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు తప్పక పాటించాలని జిల్లా కలెక్టరు వి.వినయ్ చంద్ సూచించారు. రాష్ట్రంలో కర్ఫ్యూ మొదలయినప్పటి నుండి కేసులలో తగ్గుదల చూస్తున్నామని, మొదట్లో కేసుల సంఖ్య నిలకడగా ఉందని, తదుపరి ప్రతీరోజు తగ్గుతున్నాయన్నారు. జిల్లాలో ప్రస్తుతం 7 శాతం పాజిటివ్ వస్తున్నాయని ఇది ఇంకాతగ్గాలని అందుకే ప్రభుత్వం ఇంకొక 10రోజులు కర్ఫ్యూను పొడిగించిందన్నారు. ఫీవర్ సర్వే ఇంకొంక రౌండ్ జరుగుతుందని, దానివలన, టెస్టుల నిర్వహణ, హోమ్ ఐసోలేషన్ , మందుల వాడకం వలన కరోనా చైన్ బ్రేక్ అవుతుందని మంచి ఫలితాలు వస్తాయన్నారు. సర్వే సమయంలో ఆశా కార్యకర్తలు ఇళ్లలోకి వెళ్లనక్కర్లేది, వారికి స్థానికంగా గల కుటుంబాలతో పరిచయాలు ఉంటాయని బయటనుంచే వివరాలు సేకరించ వచ్చన్నారు. ఫీవర్ సర్వేవలన కోవిడ్ పాజిటివ్ లక్షణాలు ఉన్నవారు తెలుస్తారని, తద్వారా తగు చర్యలు చేపట్టవచ్చన్నారు. కరోనా పూర్తిగా తగ్గేవరకు జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా వుంటుందన్నారు.
బ్లాక్ ఫంగస్ : జిల్లాలో బ్లాక్ ఫంగస్ (మ్యూకర్ హైపోసిస్) వ్యాధికి ఇ.ఎన్.టి ఆసుపత్రిని నోడల్ ఏజెన్సీగా ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో 500 బెడ్స్ తో సన్నద్థంగా ఉన్నామని, వ్యాధికి అవసరమైన స్థాయిలో డ్రగ్స్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. జిల్లాలో బెడ్స్ సంఖ్య బాగా పెంచడం జరిగిందని, క్లినికల్ మేనేజ్మెంటు బాగా తెలిసిందని వివరించారు. డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది జిల్లాలోను, ఏజెన్సీలో కూడా పెరిగారన్నారు. ఆక్సిజన్ కు కొరత లేదని, నాలుగు ఆక్సిజన్ ప్లాంట్స్ వచ్చాయి అని తెలిపారు. ఆరోగ్యశ్రీ : క్యాటగిరీ “ఎ’’ ఆసుపత్రులలో అన్ని బెడ్స్ ఆరోగ్యశ్రీకి కేటాయింపు చేయాలని, క్యాటగిరి “బి” ఆసుపత్రులలో 50 శాతం బెడ్స్ తప్పనిసరిగా ఆరోగ్యశ్రీకి కేటాయించి అందుబాటులో వుంచాలన్నారు. నిబంధనలు పాటించని ఆసుపత్రులకు విజిలెన్స్ అధికారులు నోటీసులు ఇస్తున్నారని, కేసులు ఫైల్ చేసి, పెనాల్టీలు విధించిడం జరిగిందని తెలియజేశారు.