శభాష్ అనంతపురం..


Ens Balu
3
Anantapur
2021-06-01 13:14:03

అనంతపురం పట్టణంలో  సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వద్ద 300 పడకలతో నిర్మించిన తాత్కాలిక ఆసుపత్రిలో వైద్య సేవలు ప్రారంభమయ్యాయి. మంగళవారం ఉదయం పట్టణంలో జెర్మన్ హ్యాంగర్స్ పద్ధతిలో నిర్మించిన తాత్కాలిక కోవిడ్ ఆసుపత్రిని జిల్లా ఇన్చార్జి మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడ క్యాంపు కార్యాలయం నుండి వర్చువల్ విధానం ద్వారా అధికారికంగా ప్రారంభించారు.  తాత్కాలిక ఆసుపత్రి ప్రారంభోత్సవం సందర్భంగా బొత్స సత్య నారాయణ మాట్లాడుతూ మూడు వందల పడకల తాత్కాలిక ఆసుపత్రిని 20 రోజుల్లో నిర్మించడం అసాధారణమైన విషయం అన్నారు. ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు మరియు ఇతర అధికార యంత్రాంగానికి అభినందనలు తెలిపారు. ఏ ఒక్కరూ కోవిడ్ మహమ్మారి ద్వారా ఆత్మస్థైర్యం కోల్పోకూడదు,  ప్రతి ఒక్క పేదవాడికి  నాణ్యమైన వైద్య సేవలు  అందించాలన్నదే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆశయమన్నారు.

ప్రారంభోత్సవం సందర్భంగా ఆసుపత్రిలో నియమితులైన సిబ్బందికి మంత్రి దిశానిర్దేశం చేశారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో కంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే మంచి వైద్యం అందుతుంది అనే నమ్మకం ప్రజల్లో కలిగే విధంగా పని చేయాలన్నారు.  స్థానికంగా ప్రారంభోత్సవంలో పాల్గొన్న రోడ్లు భవనాల శాఖ మంత్రి శంకర నారాయణ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వం ఎంత ఖర్చు చేయడానికైనా సిద్ధంగా ఉందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కరోనా వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు పదిలక్షల రూపాయలను అందించాలనే ఆలోచన ముఖ్యమంత్రి చేశారు. అందుకు సంబంధించిన చెక్కులను కూడా నేడు పంపిణీ చేశామన్నారు. తాత్కాలిక ఆసుపత్రిని 20 రోజుల్లోనే పూర్తి చేసేందుకు కృషి చేసిన జిల్లా యంత్రాంగానికి, సహకరించిన ప్రజా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.

విజయవాడ నుండి మంత్రి బొత్స నారాయణతో పాటు పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, గుంతకల్ ఎమ్మెల్యే వై.  వి.వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్సీ శమంతకమణి, పార్లమెంటు సభ్యులు మిథున్ రెడ్డి వర్చువల్ విధానంలో పాల్గొన్నారు . స్థానిక అనంతపురం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నందు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథి రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ఎం.శంకర్ నారాయణ, అనంతపురం పార్లమెంటు సభ్యులు టి. రంగయ్య, హిందూపురం పార్లమెంటు సభ్యులు గోరంట్ల మాధవ్, స్థానిక శాసన సభ్యులు అనంత వెంకట్రామిరెడ్డి , జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, నగర మేయర్ మహమ్మద్ వసీం,  జాయింట్ కలెక్టర్లు సిరి, నిశాంత్ కుమార్, డి.ఎమ్.హెచ్.ఓ కామేశ్వర్ ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ మూర్తి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు .

సిఫార్సు