రైతులకు సాగునీటి ఇబ్బందులు రాకూడదు..


Ens Balu
5
Guntur
2021-06-01 14:27:33

గుంటూరు జిల్లాలో వ్యవసాయ, సాగు నీటి పారుదల వంటి అంశాలలో రైతులకు ఇబ్బంది లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్ చార్జ్ మంత్రి మరియు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు ఆదేశించారు. మంగళవారం తాడేపల్లిగూడెం నుండి వర్చువల్ విధానంలో జూమ్ యాప్ ద్వారా జిల్లా ఇన్ చార్జ్ మంత్రి మరియు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అధ్యక్షతన జిల్లా స్థాయి వ్యవసాయ సలహా మండలి, జిల్లా నీటి పారుదల సలహా మండలి సమావేశం జరిగింది.  ఈ సమావేశంలో సలహా మండలి చైర్ పర్సన్ నల్లమోతు శివరామకృష్ణ, రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డి, నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలు, వినుకొండ శాసన సభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు, నరసరావుపేట శాసన సభ్యులు గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి, మాచర్ల శాసన సభ్యులు పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, పెదకూరపాడు శాసన సభ్యులు నంబూరి శంకర రావు, పొన్నూరు శాసన సభ్యులు కిలారి వెంకట రోశయ్యలు పాల్గొన్నారు. కలక్టర్ క్యాంపు కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్,  సంయుక్త కలెక్టర్ ( రైతు భరోసా, రెవిన్యూ ) ఏ.ఎస్. దినేష్ కుమార్, వ్యవసాయ శాఖ సంయక్త సంచాలకులు విజయ భారతి, నాగార్జున సాగర్ కుడి కాలువ చీఫ్ ఇంజనీర్ గంగరాజు, నీటి పారుదల శాఖ పర్యవేక్షక ఇంజనీర్ బాబురావు సమావేశానికి హాజరైనారు.  వినుకొండ శాసన సభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ మొక్కజొన్న పంటను కారుమంచి కొనుగోలు కేంద్రంలో ఒక్కో రైతు నుండి 25 క్వింటళ్ళు మాత్రమే కొనుగోలు చేస్తున్నారన్నారు.  అంతకంటే ఎక్కువ పండించిన పంటను కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలనే రైతుల విన్నపాన్ని పరిశీలించాలని కోరారు.  శనగ పంటను కూడా కొనుగోలు కేంద్రంలో ఇంకొన్ని రోజుల పాటు కొనసాగించాలని సూచించారు.  జింక్, జిప్సం, బోరాన్ వంటి సూక్ష్మ పోషకాలను రైతులకు రాయితీ పై అందించాలని విజ్తప్తి చేశారు.          నరసారావుపేట శాసన సభ్యులు గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ రొంపిచర్ల మండలంలోని కొన్ని భూములు వెబ్ లాండ్ లో తమ పేర్లు నమోదు కాలేదని రైతులు తెలిపారన్నారు. రైతుల వద్ద   ఎటువంటి పత్రాలు లేనందు వలన ఈ – పంట  పోర్టల్ లో రైతుల పేర్లు నమోదు కావడం లేదని పేర్కొన్నారు. ఈ సమస్యను అధికారులు పరిష్కరించాలని కోరారు.


 

          పెదకూరపాడు శాసన సభ్యులు నంబూరి శంకర రావు మాట్లాడుతూ  జిల్లాలో ఆర్మర్ రకం మిరప విత్తనాలకు ఎక్కువ డిమాండ్ రైతుల నుండి వస్తున్నదన్నారు. జిల్లాకు ఆర్మర్  రకాన్ని తెప్పించి ఆర్ బి కె కేంద్రాల ద్వారా రైతులకు సరఫరా అయ్యేలా చూడాలని కోరారు.సలహా మండలి సభ్యులు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు అధిక దిగుబడులను ఇస్తున్న  ఇతర మిరప పంట రకాలను ఎంచుకునేటట్లు ఆర్బికె ల ద్వారా ఆవగాహన కల్పించాలన్నారు.


          సంయుక్త కలెక్టర్ ( రైతు భరోసా, రెవెన్యూ ) ఏ.ఎస్. దినేష్ కుమార్ మాట్లాడుతూ ప్రాధాన్యం లేని వరి కొనుగోలుకు ఎంఎల్ఆర్ -145, ఎంటియు -1010, ఎంటియు – 1001 వంటి రకాలను రైతులు సాగు చేయకుండా చూడాలన్నారు.  అధిక దిగుబడులను ఇచ్చే ఇతర వరి రకాలను సాగు చేసే విధంగా వ్యవసాయ శాఖ అధికారులు, మండల మరియు ఆర్బికే  స్థాయి సలహా మండలి సభ్యులు రైతులను చైతన్య పరచాలని సూచించారు. 


           సాగునీటి అంశాలకు సంబంధించి ఈ సమావేశంలో జిల్లా ఇన్ చార్జ్ మంత్రి మరియు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు చర్చించారు. ఈ సమావేశంలో శాసన సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, జిల్లా నీటి పారుదల శాఖలోని అభివృద్ది పనులు, రాబోయే ఖరీఫ్ పంటకు నీటి విడుదల మరియు ఇతర విషయాలపై చర్చించడం జరిగింది.  గోదావరి లోని నీటి లభ్యతను బట్టి కృష్ణా పశ్చిమ డెల్టా రైతులకు జూలై 1 వ తేదీన మరియు నాగార్జున సాగర్ ప్రాజెక్టు లోని నీటి నిల్వ సామర్ధ్యాన్ని బట్టి నాగార్జున సాగర్ కుడి కాలువ ఆయకట్టుకు ఆగష్టు 15 వ తేదీన నీటిని విడుదల చేయుటకు తీర్మానించడమైనది. కృష్ణా పశ్చిమ డెల్టాలోని నాన్ నోటిఫైడ్ డ్రైయిన్ల మరమ్మత్తులను   ఏం జి ఎన్ ఆర్ ఇ జి ఎస్ ద్వారా చేపట్టి త్వరితగతిన పూర్తి చేయవాల్సిందిగా నీటి యాజమాన్య సంస్థ  అధికారులను సభ్యులు కోరడం జరిగింది.  కాలువలు మరియు డ్రైయిన్ల లో వార్షిక మరమ్మత్తులు జూన్ 15 వ తేదీ లోపు టెండర్ ప్రక్రియ పూర్తి చేసి జూన్ నెలాఖరు నాటికి పనులను పూర్తి చేసి ఖరీఫ్ పంట నీటి విడుదలకు ఆటంకం లేకుండా చూడవలసిందిగా ఇరిగేషన్ అధికారులను కోరడం జరిగింది.  డ్రైయిన్ల అభివృద్ది కొరకు నాబార్డ్ పధకం క్రింద రూ. 465 కోట్లతో పంపిన ప్రతిపాదనలు ప్రభుత్వం వారి ఆమోదం పొందే విధంగా తగు చర్యలు తీసుకోవలసిందిగా ఇరిగేషన్ అధికారులను సమావేశంలో కోరడం జరిగింది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు లోని వివిధ కాలువలకు సంబంధించిన వార్షిక మరమ్మత్తులు త్వరితగతిన పూర్తి చేసి కాలువలను నీటి విడుదలకు సిద్దంగా వుంచ వలసిందిగా సమావేశంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు అధికారులను కోరడం జరిగింది. 


          కార్యక్రమంలో జిల్లా స్థాయి సలహా మండలి సభ్యులు శ్రీనివాస రెడ్డి, అనుబంధ రంగాల అధికారులు తదితరులు వర్చువల్ విధానం ద్వారా జరిగిన సమావేశంలో పాల్గొన్నారు.