పించను పంపిణీలో విజయనగరం జిల్లా నెంబర్ 1..


Ens Balu
2
Vizianagaram
2021-06-01 14:29:42

వైఎస్సార్ పింఛన్ కానుక పథకం కింద, పేదలకు పింఛన్లు పంపిణీ చేయడంలో విజయనగరం జిల్లా మరోమారు తన రికార్డును నిలబెట్టుకుంది. ఈ నెల కూడా, తొలిరోజే సాయంత్రం 6 గంటల సమయానికి సుమారు 92.34 శాతం మందికి పింఛన్లు అందజేసి, రాష్ట్రంలో నెంబర్ 1 గా నిలిచింది. ఈ నెలకు గానూ 3,33,476 మందికి పింఛన్లు మంజూరు చేయగా, మొదటి రోజు మంగళవారం నాడే ఏకంగా, 3,07,941 మందికి పింఛన్ అందజేశారు. మన జిల్లా తరువాత స్థానంలో చిత్తూరు, కడప, అనంతపురం, నెల్లూరు జిల్లాలు నిలిచాయి.  జిల్లా వ్యాప్తంగా ఉదయం 6 గంటలకే పింఛన్ పంపిణీ ప్రారంభమయ్యింది. వలంటీర్లు ఇంటింటికి వెళ్లి పింఛన్ అందజేశారు. అనారోగ్యంతో ఉన్నవారికి కూడా పింఛన్ ఇచ్చారు. ఈ పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో, జాయింట్ కలెక్టర్ (ఆసరా) జె.వెంకటరావు, డిఆర్డీఏ పిడి కె.సుబ్బారావు పర్యవేక్షించారు. వివిధ మండలాల్లో ప్రత్యేకాధికారులు, ఎంపిడివోలు పింఛన్ పంపిణీని పరిశీలించారు.