కరోనా కట్టడికి అంతా కలిసిరావాలి..
Ens Balu
2
Vizianagaram
2021-06-01 14:43:51
కోవిడ్ మహమ్మారిని పూర్తి స్థాయిలో అరికట్టడానికి జిల్లాలోని స్వచ్ఛంద సంస్థలన్నీ కలిసి రావాలని.. అధికార యంత్రాంగంతో సమన్వయంగా వ్యవహరించి సహాయ సహాకారాలు అందించాలని జెసి మహేష్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ, ప్రస్తుతం కరోనా నియంత్రణ దశలో ఉందని... దాన్ని పూర్తిగా కట్టడి చేసేందుకు స్వచ్ఛంద సంస్థల సేవలను విస్తృతి చేయాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా గుర్తించిన సుమారు 400 ఐసోలేషన్ కేంద్రాల్లో అవసరమైన మేరకు సేవలందించాలని కోరారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా యూత్ కో-ఆర్డినేటర్ విక్రమాధిత్య ఆధ్వర్యంలో జిల్లాలోని స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు, సభ్యులతో మంగళవారం జరిగిన సమావేశంలో జేసీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కరోనా కట్టడికి అనుసరించాల్సిన పద్ధతులు, అమలు చేయాల్సిన విధానాలపై మాట్లాడారు. క్షేత్రస్థాయిలో కరోనా రోగులను గుర్తించి వారిని ఐసోలేషన్ కేంద్రాలకు తరలించటంలో స్వచ్ఛంద సంస్థల సభ్యులు కీలకపాత్ర పోషించాలని సూచించారు. వ్యాధి లక్షణాలు ఉన్నవారిని ఐసోలేషన్ కేంద్రాలకు, పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నవారిని ఆసుపత్రికి తరలించటంలో సహాయపడాలని కోరారు. మండల స్థాయిలో నియమించే నోడల్ అధికారులతో సమన్వయంగా వ్యవహరిస్తూ ఫలవంతమైన సేవలందించాలని సూచించారు. ప్రస్తుతం జిల్లాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని కానీ గ్రామాల్లో అవగాహన లేక ప్రజలు బయట తిరిగేస్తున్నారని.. లక్షణాలు ఉన్నప్పటికీ టెస్టులు చేయించుకోకుండా, జాగ్రత్తలు వహించకుండా సంచరిస్తున్నారని పేర్కొన్నారు. అలాంటి వారిలో అవగాహన కల్పించి కరోనాను నియంత్రించటంలో స్వచ్ఛంద సంస్థలు భాగస్వామ్యమవ్వాలని జేసీ ఈ సందర్భంగా సూచించారు. ఈ క్రమంలో పలు స్వచ్ఛంద సంస్థల నిర్వాహకుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు. కార్యక్రమంలో జిల్లా యూత్ కో-ఆర్డినేటర్ విక్రమాధిత్య, జిల్లా పరిషత్ సీఈవో వెంకటేశ్వరరావు, జిల్లాలోని పలు స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.