జగనన్న గోరుముద్ద పథకం క్రింద విద్యార్థులకు డ్రై రేషన్ సరుకులను, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ పంపిణీ చేశారు. కలెక్టరేట్‌లో బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో ప్రాధమిక పాఠశాల విద్యార్థులకు 4.5 కిలోలు, ప్రాధమిక, ప్రాధమికోన్నత పాఠశాలల విద్యార్థులకు 6.5 కిలోలు చొప్పున కందిపప్పును అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని, జగనన్న గోరుముద్ద పథకం క్రింద ప్రభుత్వం పౌష్టికాహారం అందజేయడ జరుగుతోందన్నారు. కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో, పాఠశాలలు మూసివేయడం వల్ల, విద్యార్థులకు ప్రస్తుతం డ్రైరేషన్ సరుకులను పంపిణీ చేస్తున్నామన్నారు. సెప్టెంబరు 2020 నుంచి జనవరి 2021 వరకూ, ఐదు విడతల రేషన్ సరుకులను ప్రస్తుతం అందజేస్తున్నామని తెలిపారు. జిల్లాలో మొత్తం 1,95,187 మంది విద్యార్థులకు కందిపప్పును త్వరలోనే పూర్తిగా పంపిణీ చేస్తామని చెప్పారు. ఇవి కాకుండా బియ్యం, గుడ్లు, చిక్కీలను కూడా ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఆర్.మహేష్ కుమార్, జిల్లా విద్యాశాఖాధికారి జి.నాగమణి, ఏడి జ్యోతి, ఇతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.