రాష్ట్రంలో ప్రజలందరికీ అత్యాధునిక వైద్యసేవలను అందుబాటులోకి తీసుకురావడానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన చర్యలతో రాష్ట్రం ‘ఆరోగ్యాంధ్రప్రదేశ్’ గా మారుతోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి అభిప్రాయపడ్డారు. ఆరోగ్య సేవలకు సిఎం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని, రాష్ట్రంలో 95శాతం ప్రజలకు ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యాన్ని ఉచితంగా అందించడంతో పాటుగా వేల కోట్ల రుపాయల వ్యయంతో కొత్త మెడికల్ కాలేజీలు, హెల్త్ హబ్ లు, వైయస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ లను ఏర్పాటు చేస్తున్నారని వివరించారు.
పార్వతీపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఒక వైద్యశాలను బుధవారం ఉప ముఖ్యమంత్రి ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగానే పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ, రాష్ట్రంలో కోవిడ్ బాధితులకు 104 కాల్ సెంటర్ ద్వారా అవసరమైన సహాయ సహకారాలను అందించడం జరుగుతోందని చెప్పారు. కోవిడ్ నియంత్రణ కోసం సిఎం చేపట్టిన చర్యలను కేంద్ర మంత్రులు కూడా ప్రశంసించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసారు. రాష్ట్ర జనాభాలో 95శాతం మంది ప్రజలు ఆరోగ్యశ్రీ పథకం పరిధిలో ఉండగా వారికి అవసరమైన చికిత్సలన్నింటినీ పూర్తి ఉచితంగా అందించడానికి, కోవిడ్ ఆస్పత్రుల్లోనూ 50శాతం బెడ్లు ఆరోగ్యశ్రీ పథకానికి చెందిన రోగులకే కేటాయించడానికి చర్యలు తీసుకున్నారని చెప్పారు. అధిక ఫీజులను గుంజుతున్న ఆస్పత్రులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు కూడా కార్పొరేట్ వైద్యసేవలు అందించడం ద్వారా పేదలకు ఆరోగ్యభరోసాను కల్పించారని కితాబిచ్చారు. కరోనా తో పాటుగా బ్లాక్ ఫంగస్ వ్యాధులను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి చేర్చి వాటికి ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్న రాష్ట్రం దేశంలో ఆంధ్రప్రదేశ్ ఒక్కటేనని పేర్కొన్నారు. అనారోగ్యానికి గురైన పేద ప్రజలకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా వైద్యాన్ని అందించడంతో పాటుగా చికిత్సానంతరం రోగి విశ్రాంతికాలంలోనూ ఇబ్బంది పడకుండా నెలకు రూ.5 వేల ఆర్థిక సహాయాన్ని వైయస్సార్ ఆరోగ్య భరోసాగా అందిస్తున్నారని చెప్పారు. అత్యాధునికమైన వైద్య సేవలను పొందడానికి రాష్ట్ర ప్రజలు ఇతర రాష్ట్రాలలోని నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా రాష్ట్రవ్యాప్తంగా 16 హెల్త్ హబ్ లను ఏర్పాటు చేయడానికి చర్యలను తీసుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఒక వైద్య కళాశాల, 500 పడకల అత్యాధునిక ఆస్పత్రి ఉండేలా రూ.8 వేల కోట్ల వ్యయంతో ఒకేసారి 16 కొత్త మెడికల్ కళాశాలలకు శంకుస్థాపన కూడా చేసిన విషయాన్ని ఈ సందర్భంగా పుష్ప శ్రీవాణి ప్రస్తావించారు. ఇప్పటికే ప్రతి మండలంలోనూ 108 ఆంబులెన్స్ వాహనాన్ని కూడా అందుబాటులోకి తెచ్చారని గుర్తు చేసారు. ఇది కాకుండా రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో ప్రజల ముంగిళ్లలోకే వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 11 వేల వైయస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ లను కూడా ఏర్పాటు చేస్తున్నారని వెల్లడించారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న చర్యల ఫలితంగా రాష్ట్రం ఆరోగ్యాంధ్రప్రదేశ్ గా మారుతోందని పుష్ప శ్రీవాణి ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జోగారావుతో పాటుగా పార్వతీపురం మున్సిపల్ ఛేర్ పర్సన్ బోన గౌరీశ్వరి కూడా పాల్గొన్నారు.