చివరి సాగుభూమి నీరందిస్తాం..


Ens Balu
0
Vizianagaram
2021-06-02 12:47:09

విజయనగరం  జిల్లాలోని  సాగుభూమి అంతటికీ నీరందేలా చర్యలు చేపట్టినట్టు  జిల్లా కలెక్టర్ డా. ఎం. హరి జవాహర్ లాల్  తెలిపారు.   అందుకోసం నీటి పారుదల శాఖ ఒక ప్రణాళికను తయారు చేసిందని అన్నారు.   రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు  జిల్లా ఇంచార్జ్ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస రావు  ఆధ్వర్యం లో బుధవారం జిల్లా నీటి పారుదల సలహా మండలి సమావేశం వర్చువల్ విధానం లో  జరిగింది. ఈ సమావేశం లో జిల్లాకు చెందిన శాసన సభ్యులు, శాసన  మండలి సభ్యులు వర్చువల్ గా పాల్గొన్నారు. జిల్లా నీటి వనరుల వివరాలను, సాగు నీటి ప్రణాళికలను ఎస్.ఈ తొలుత వివరించారు.  ఈ సందర్భంగా   జిల్లా కలెక్టర్  మాట్లాడుతూ  జిల్లాలో  5,03,250 ఎకరాల ఆయకట్  కు  నీరందించవలసి ఉందని,  భారీ , మధ్య , చిన్న తరహా నీటి పారుదల వనరుల ద్వారా 35.75 టి.ఎం.సి ల నీటి నిల్వ  సామర్ధ్యం  ఉందని,  ప్రస్తుతం 8.272 టి.ఎం.సి ల నీరు నిల్వ ఉందని  తెలిపారు. ఈ ఏడాది వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం ఉన్నందున  సాగు నీటికి ఇబ్బంది ఉందని భావిస్తున్నామన్నారు.   వర్షాలతో పాటు అన్ని జలాశయాలను, చప్టా లను, కల్వర్ట్  లను మరమ్మతులు చేసి  నీటి సామర్ధ్యాన్ని పెంచడానికి  తగిన ప్రణాళికలు తయారు చేశామన్నారు. 
బొబ్బిలి శాసన సభ్యులు శంబంగి వెంకట  చిన్న అప్పల నాయుడు  మాట్లాడుతూ ప్రొజెక్టులకు సంబంధించిన భూ సేకరణ  చెల్లింపులు ఇంకా పెండింగ్ లో ఉన్నాయని, వెంటనే రైతులకు చెల్లించే ఏర్పాటు చేయాలని కోరారు. కలెక్టర్ మాట్లాడుతూ 14.80 కోట్ల కు గాను 10.80 కోట్ల బకాయిలు చెల్లించడం జరిగిందని, మిగిలిన మొత్తం కూడా సి.ఎఫ్.ఎం.ఎస్. లో బిల్ పెట్టడం జరిగిందన్నారు.  పార్వతిపురం శాసన సభ్యులు అలజంగి జోగా రావు మాట్లాడుతూ   నీటిని నెల రోజుల ముందుగానే విడుదల చేయాలని కోరారు. సాగు నీటి సామర్ధ్యాన్ని పెంచడానికి  మైనర్ ఇరిగేషన్ టాంక్ ల సామర్ధ్యాన్ని పెంచవలసి ఉందని కలెక్టర్ ను కోరారు. నీటి విడుదల కోసం ఆయా ప్రజా ప్రతినిధులతో చర్చించి,  తేదీలను ఖరారు చేస్తామని అన్నారు.  మైనర్ టాంక్ ల అభివృద్ధి కోసం  ఇప్పటికే 50 కోట్ల విలువ గల పనుల కోసం ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.   సాలూరు శాసన సభ్యులు రాజన్న దొర మాట్లాడుతూ పెద్ద గెడ్డ  పనులను త్వరగా పూర్తి చేయాలని కోరారు.   
జంఝావతి రబ్బర్ డ్యామ్ అంతర్ రాష్ట్ర  సమస్యను  పరిష్కరించడానికి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల స్థాయి లో చర్చ జరగవలసి ఉందని, దీనిని ప్రభుత్వ దృష్టికి తేవడం జరిగిందని అన్నారు.  ఈ ప్రాజెక్టు  పనుల కోసం 3.8 కోట్ల తో అంచనాలు తయారు చేసి ప్రతిపాదనలు పంపడం జరిగిందన్నారు.  ప్రపంచ బ్యాంక్  నిధులతో 20 పనులు మంజూరు కాగా 17 పనులు పురోగతి లో ఉన్నాయని తెలిపారు. ఈ ఖరీఫ్ కు ప్రతి ఏకరాకు సాగు నీరు అందించడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. 
ఈ వర్చువల్ కాన్ఫరెన్స్ లో  జలవనరుల శాఖ చీఫ్ ఇంజినీర్ పోలేశ్వర రావు, ,  బొబ్బిలి ఎస్.ఈ రాంబాబు, ఈ ఈ లు  అప్పల నాయుడు, రామచంద్ర రావు, తిరుపతి రావు తదితరులు పాల్గొన్నారు.