ఆటో, ట్యాక్సీ, క్యాబ్ వాహనదారులకు ఆర్థిక సాయం అందించే నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వాహనమిత్ర పథకానికి అర్హత కలిగిన వారు ఈ నెల 7వ తేదీ లోగా దరఖాస్తులు చేసుకోవాలని కలెక్టర్ డా.ఎం. హరిజవహర్ లాల్ తెలిపారు. లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.10వేల ఆర్థిక సాయం వరుసగా మూడో సంవత్సరం కూడా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని కావున కొత్తగా వాహనాలు కొనుగోలు చేసుకున్నవారు సంబంధిత సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గతంలో దరఖాస్తు చేసుకొని సాయం పొందిన వారు మళ్లీ దరఖాస్తు చేయనవసరం లేదని స్పష్టం చేశారు. అయితే పాతవారు సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితాలను సరిచూసుకోవాలని ఒక వేళ పేర్లు లేనట్లయితే మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. దరఖాస్తుతో పాటు ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డు, వాహనం యొక్క రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంకు ఖాతా పాస్ బుక్ మొదటి పేజీ కాపీ, కుల ధృవీకరణ పత్రం సమర్పించాలని వివరించారు. వాహనం భార్య పేరుమీద ఉండి ఆమెకు లైసెన్స్ లేకపోయినా, భర్తకు లైసెన్స్ ఉంటే అర్హులేనని చెప్పారు. అలాగే వాహనం తల్లి, తండ్రి లేదా కూతురు, కుమారుడు పేరిట ఉండి లైసెన్స్ మేజర్ కుమారుడు పేరుమీద ఉన్నా పథకానికి అర్హులేనని కలెక్టర్ స్పష్టం చేశారు. దరఖాస్తు నింపడంలో, నింపిన దరఖాస్తు సమర్పించటంలో సమస్యలు ఉన్నచో స్థానిక ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్లు, గ్రామ, వార్డు సచివాలయాల్లో సంప్రదించాలని సూచించారు. ఈ నెల 7వ తేదీ లోగా సమర్పించిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ 12వ తేదీలోపు పూర్తవుతుందని పేర్కొన్నారు. జూన్ 15వ తేదీన ముఖ్యమంత్రి చేతుల మీదుగా అర్హులైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా రూ.10వేల ఆర్థిక సాయం జమ అవుతుందని వివరించారు. ఈ మేరకు జిల్లాలో సంబంధిత విభాగాల అధికారులతో బుధవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి లబ్ధిదారుల ఎంపికకు సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేశారు. సంబంధిత సాంకేతిక ప్రక్రియలు పూర్తి చేయాలని, లబ్ధిదారుల ఎంపికిలో పారదర్శకత వహించాలని సూచించారు. టెలీకాన్ఫరెన్స్‌లో సంయుక్త కలెక్టర్లు జి.సి. కిశోర్ కుమార్, జె. వెంకటరావు, జిల్లా రవాణా శాఖ ఉప కమిషనర్ శ్రీదేవి, సీఈవో టి. వెంకటేశ్వరరావు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.