మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలో ఎక్కడ అనధికార నిర్మాణాలు జరిగినా వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని జివిఎంసీ కమిషనర్ డా.జి.స్రిజన అధికారులను హెచ్చరించారు. బుధవారం నాలుగవ జోన్ 29వ వార్డులో జోనల్ కమిషనర్ తో కలసి ఆమె పర్యటించారు. ఈ వార్డు పర్యటనలో వెంకటపతిరాజు నగర్ లో నూతనంగా నిర్మిస్తున్న కట్టడాన్ని కమిషనర్ పరిశీలించారు. భవన నిర్మాణ ప్లాన్ అనుమతుల నిబంధనలకు విరుద్ధంగా, సెట్ బ్యాకులు విడువకుండా నిర్మాణాలు చేపట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమీపంలో రోడ్డునకు ఆనుకొని అనధికారంగా దేవాలయ నిర్మాణంపై సంబంధిత టౌన్ ప్లానింగ్ ఆఫీసరు ఝాన్సీ ను వివరణ కోరారు. ఈ అనధికార కట్టడాలపై తగిన పరిశీలనలు జరపని టౌన్ ప్లానింగ్ ఆఫీసరు ఝాన్సీ, ప్లానింగ్ సెక్రటరిపై తగిన చర్యలు చేపట్టాలని జోనల్ కమిషనర్ ఫణిరాం ను ఆదేశించారు. భవన నిర్మాణ ప్లాన్ అనుమతులు పొందిన ప్రతీ నిర్మాణ ప్రదేశాలలో తప్పని సరిగా అనుమతి పొందిన ప్లాన్ కాపీను నిర్మాణదారులు ప్రదర్శించేలా చూడాలని జోనల్ కమిషనర్ ను ఆదేశించారు. అనధికార నిర్మాణాలను చేపడితే సహించేది లేదని, సంబంధిత ప్లానింగు అధికారులు నిత్యం పర్యటిస్తూ భవన నిర్మాణాలను పరిశీలించాలని జోనల్ కమిషనర్ ను ఆదేశించారు. అనంతరం చెత్తను వేరు చేసి ఇవ్వని సుహారిక అపార్ట్మెంట్ ను కమిషనర్ పరిశీలించారు. అపార్ట్మెంట్ నివాసితులు చెత్తను వేరు చేసి రోజూ పారిశుధ్య సిబ్బందికి అందించనందున అపార్ట్మెంట్ నివాసితులకు జరిమానా విధించమని కమిషనర్ ప్రధాన వైధ్యాదికారి డా. కె.ఎస్.ఎల్.జి. శాస్త్రిని ఆదేశించారు. అనంతరం వార్డు నందు పలుచోట్ల రోడ్లను తవ్వి, పూడ్చకుండా వదిలేయడం వలన ప్రజల రాకపోకల ఇబ్బందిని కమిషనర్ గమనించారు. రోడ్ల పనులు పూర్తి అయిన పిదప, సిమెంటు పూడ్చకుండా వదిలేసిన ఇపిడిసిఎల్ ప్రాజెక్టు కాంట్రాక్టర్లకు జరిమానా విధించాలని జోనల్ కమిషనర్ ఫణిరాం ను ఆదేశించారు. అనంతరం, ఆ వార్డు నివాసితులతో మాట్లాడుతూ, ప్రతి ఇంటి వారు చెత్తను వేరు చేసి అందించాలని అన్నారు. రాబోయే వర్షాకాలంలో దోమలు వృద్ధి చెందకుండా నీటి నిల్వలు లేకుండా తగు జాగ్రత్తలను తీసుకోవాలన్నారు. తద్వారా మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు ప్రబలకుండా అరికట్టవచ్చన్నారు. ప్రతీ రోజూ ఇంటింటి నుండి వేరు చేసిన చెత్తను పారిశుధ్య సిబ్బంది సేకరించేలా అందరు శానిటరి ఇన్స్పెక్టర్లు చూడాలని కమిషనర్ అన్నారు. వీధిలో రోడ్లను ఊడ్చి చెత్తను సేకరించుటకు కావలసిన గార్బేజ్ బ్యాగులను సీవేజ్ ఫారం నుండి పొందవలెనని కమిషనర్ శానిటరి ఇన్స్పెక్టర్లను ఆదేశించారు. ఈ పర్యటనలో ప్రధాన వైధ్యాధికారి డా. కె.ఎస్.ఎల్.జి. శాస్త్రి, జోనల్ కమిషనర్ ఫణిరాం, కార్యనిర్వాహక ఇంజినీర్(ఎలక్ట్రికల్) పి. శ్రీనివాస రావు, కార్యనిర్వాహక ఇంజినీర్(మెకానికల్) చిరంజీవి, అసిస్టెంట్ ఇంజినీరు (వాటర్ సప్ప్లై) విల్సన్, శానిటరి సూపర్వైజర్ శ్రీనివాస రాజు, శానిటరి ఇన్స్పెక్టర్ అప్పలరాజు, వార్డు సెక్రటరి తదితరులు పాల్గొన్నారు.