నగర వాసులంతా చెత్తను వేరుచేసి ఇవ్వాలి..
Ens Balu
2
విశాఖ సిటీ
2021-06-02 13:32:39
విశాఖనగర ప్రజలు తమ ఇంటిలో వ్యర్ధాలను 3 రంగుల చెత్త బుట్టలలో వేరు చేసి రోజూ పారిశుధ్య సిబ్బందికి అందించాలని అదనపు కమిషనర్ డా.వి.సన్యాసిరావు కోరారు. బుధవారం 3 జోన్ నందు 19వ వార్డులో ఆయన పర్యటించారు. ఈ పర్యటనలో ముందుగా 19వ వార్డు పెద్దజాలారిపేట లో ప్రతీ ఇంటింటి నుంచి చెత్త సేకరణ జరుగుతున్న విధానాన్ని తనిఖీ చేశారు. ప్రతి ఇంటిలో వ్యర్ధాలను వేరు చేయుటకు గాను, 3 రంగుల చెత్త బుట్టలను నివాసితులకు ఉచితంగా అదనపు కమిషనర్ పంపిణీ చేశారు. అనంతరం అదనపు కమిషనర్ నివాసితులతో మాట్లాడుతూ మీ మీ ఇంటిలో చెత్తను 3 రకాలుగా వేరు చేయాలని, అందుకు తడి చెత్తను పచ్చ బుట్టలోను, పొడి చెత్తను నీలం బుట్టలోను, ప్రమాదకరమైన చెత్తను ఎరుపు రంగు గల బుట్టలోను వేరు చేసి రోజూ మీ ఇంటికి వస్తున్న పారిశుధ్య సిబ్బందికి అందించాలని, పరిసరాల పరిశుభ్రతకు సహకరించాలని తెలిపారు. అనంతరం 21వ వార్డు నందు అదనపు కమిషనర్ పర్యటించారు. ఈ వార్డు నందు మెయిన్ రోడ్డు లో గల ఖాళీ స్థలాల్లో చెత్త పేరుకుపోయి ఉన్నందున ఆ స్థలాల్లో చెత్తను వెంటనే తరలించాలని వార్డు శానిటరి ఇన్స్పెక్టర్ ను అదనపు కమిషనర్ ఆదేశించారు. ఈ పర్యటనలో జివిఎంసి స్టేటస్టికల్ అధికారి రమణ మూర్తి, శానిటరి ఇన్స్పెక్టర్ తదితరులు పాల్గొన్నారు.