విశాఖ జిల్లాతో పాటుగా రాష్ట్రంలో కూడా కోవిడ్ తగ్గుముఖం పట్టిందని, కరోనా నియంత్రణకు కృషి చేస్తున్న అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలియజేస్తున్నామని జిల్లా ఇన్ఛార్జి మంత్రి, వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు చెప్పారు. బుధవారం కలెక్టరు కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫ్రంట్ లైన్ వర్కర్ల కృషి ఫలితంగా పాజిటివ్ రేటు 13 శాతానికి తగ్గిందన్నారు. అయినా ప్రజలు, జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా వుండాలన్నారు. ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులతో జిల్లాలో కరోనా పరిస్థతి, అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించామని చెప్పారు.
నగరంలో కోవిడ్ చికిత్స 7 కోవిడ్ కేర్ సెంటర్లు, 74 ఆసుపత్రులలో నిర్వహిస్తున్నారని, 5,779 పడకలు అందుబాటులో వున్నాయన్నారు. కరోనా తగ్గుముఖం పట్టినప్పటికీ విశాఖ విస్తృతి, ఇతర జిల్లాల ఒత్తిడి వున్నందున కరోనా ఆసుపత్రులను తగ్గించట్లేదన్నారు. జిల్లాలో 113 బ్లాక్ ఫంగస్ కేసులకు చికిత్స జరుగుతుందని, అందులో 82 మందికి కెజిహెచ్ లో చికిత్స చేస్తున్నారని, మరో 9 ఆసుపత్రులను ముందు జాగ్రత్త చర్యగా సిద్దం చేశారని వెల్లడించారు. జిల్లాలో కరోనా, దానికి సంబంధించిన రుగ్మతలను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు అవసరమైన ఇంజెక్షన్లు, మందులు ఇతర పరికరాలు, సామగ్రి, హోమ్ ఐసోలేషన్ కిట్లు అందుబాటులో వున్నాయన్నారు. 104 సెంటర్ సేవలు విషయంలో జిల్లా ముందులో వుందన్నారు. జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రణాళికా ప్రకారం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వ్యాక్సిన్ వేయించుకునే వారు ఎక్కువ సమయం వేచి వుండకుండా వారికి కేటాయించిన సమయాని ముందుగా తెలయజేయడం జరుగుతుందన్నారు. వైద్యం, చికిత్స సేవాభావంతో చేయాలని, ముఖ్యమంత్రి ఆసుపత్రులకు స్పష్టం చేశారని, నిబందనలు పాటించని ఆసుపత్రులకు జరిమానాలు విధించామన్నారు. కోవిడ్ ను ఆరోగ్యశ్రీ కింద తీసుకొనని హాస్పటల్లపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నిబందనలు పాటించని ఆసుపత్రులకు రూ.57 లక్షలు జరిమానా, 30 కేసులు పెట్టడం, 8 నోటీసులు జారీ చేయడం జరిగిందన్నారు. స్మశానాల వద్ద సౌకర్యాలు పెంచాలని జివియంసి పూర్తి ఖర్చు భరించేలా తీర్మానించామన్నారు. బ్లాక్ ఫంగస్ పట్ల శ్రద్ద వహించవలసినదిగా ఈ.ఎన్.టీ. ఆసుపత్రిని ఆదేశించామన్నారు.
అభివృద్ధి పనులపై సమీక్ష
విశాఖ మహా నగర సంస్థ అభివృద్ధి పనులలో ఎక్కువగా పర్యావరణ అనుమతుల మూలంగా జాప్యం జరుగుతున్నదని, ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎంపీ విజయసాయిరెడ్డి ఢిల్లీ స్థాయిలో సమన్వయం చేస్తారని చెప్పారు. భూగర్భ మురుగు కాల్వలు, భూగర్భ విద్యుత్ కేబిల్స్ మధ్య సక్రమమైన అనుసంధానం వుండాలని గుర్తించామన్నారు. అదే విధంగా అనకాపల్లి, అగనంపూడి, కొమ్మాది తాగునీటి పైపులైన్లు ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలని నిర్ణయించామన్నారు. అభివృద్ధి పనులకు కాలనిర్ణయిం చేసి, నిర్ణీత సమయాలలో సమీక్ష చేస్తారన్నారు. విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వి.యం.ఆర్.డి.ఏ.) కు సంబంధించి రోడ్లు, కైలాసగిరి అభివృద్ధి, ప్లానిటోరియం, కాపులుప్పాడ నేషనల్ హిస్టరీ పార్క్, మ్యూజియం పనులు, ముడసర్లోవ అభివృద్ధి పనులపై చర్చించడం జరిగిందన్నారు. అంతే కాకుండా జిల్లాలోని గ్రామీణ ప్రాంత అభివృద్ధి, తాగు, సాగు నీటి పథకాలపైనా చర్చించామని వెల్లడించారు.
అంతకు ముందు పర్యాటక శాఖ మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లాలో అమలు చేస్తున్న పనులలో 70 శాతం పనులు పూర్తయ్యారని తెలిపారు. జివియంసి కి రావలసిన బిల్లులు, పన్ను చెల్లింపు బకాయిల సమస్యను పిరిష్కరిస్తామన్నారు. రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి మాట్లాడుతూ విశాఖను గొప్ప నగరంగా తీర్చి దిద్దాలన్న ముఖ్యమంత్రి ఉద్దేశాలకు అనుగుణంగా ప్రణాళికలు అమలు చేశామన్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధుల సమన్వయంతో అభివృద్ది పనులపై సమీక్షలు నిర్వహిస్తామన్నారు. నగరంలోని 98 వార్డుల అభివృద్ధికి కమిటీలను వేసి ప్రణాళికా బద్దంగా పనులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టరు వి.వినయ్ చంద్, మళ్ళ విజయ ప్రసాద్, కె.కెరాజు తదితరులు పాల్గొన్నారు.