అంగన్వాడీ కేంద్రాలకు జూన్ నుండి బలవర్ధక బియ్యాన్ని సరఫరా చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ జె నివాస్ తెలిపారు. ఈ బలవర్ధక బియ్యాన్ని పౌరసరఫరాల సంస్ధ అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఐరన్, ఫోలిక్ ఏసిడ్, బి 12లతో సమ్మిళితం చేసిన బియ్యపు పిండిని తిరిగి బియ్యం రూపంలో మరల్చి (Fortified Rice) ఇవ్వడం జరుగుతుందని ఆయన చెప్పారు. పౌష్టికాహారం కలయికతో గర్భిణీలకు, బాలింతలకు, చిన్నారులకు బలవర్దకమైన ఆహారం అంది ఆరోగ్యంగా ఎదుగుదలకు అవకాశం ఉంటుందని ఆయన వివరించారు. బలవర్ధక ఆహార అవగాహన పోస్టర్లను బుధ వారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ నివాస్ విడుదల చేసారు. జిల్లాలో 4,192 అంగన్వాడీ కేంద్రాల ద్వారా 18,599 మంది గర్భిణీలు, 17,817 మంది బాలింతలు వెరశి 36,416 మంది మహిళలు, 3 నుండి 6 సంవత్సరాల వయస్సుగల చిన్నారులు 57,685 మంది బలవర్ధక ఆహారం పొందుతారని ఆయన చెప్పారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు నెలకు 2,219.59 క్వింటాళ్ళ బరవర్ధక బియ్యాన్ని జూన్ నుండి ప్రారంభం జరుగుతుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్లు సుమిత్ కుమార్, డా.కె.శ్రీనివాసులు, జిల్లా సరఫరా అధికారి డి.వి.రావు, పౌరసరఫరాల సంస్ధ జిల్లా మేనేజర్ ఎన్.నరేంద్ర బాబు, మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరక్టర్ జి.జయదేవి తదితరులు పాల్గొన్నారు.