వాహన మిత్ర పథకం కింద ఆర్థిక సహాయం పొందుటకు వాహనదారులు నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ కోరారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన జారీ చేస్తూ 2021- 22 సంవత్సరానికి వాహన మిత్ర పథకం కింద పదివేల రూపాయల సహాయం అందించుటకు ప్రభుత్వం ప్రకటించడం జరిగిందని ఆయన తెలిపారు. ఆటో రిక్షా, టాక్సీ క్యాబ్, మ్యాక్స్ క్యాబ్ కు సంబంధించిన అర్హత కలిగిన వాహన యజమానులు దరఖాస్తులను సంబంధిత వాలంటీర్లు, సచివాలయ కార్యదర్సులు వద్ద ఈ నెల 7వ తేదీ వరకు నమోదు చేసుకోవాలని ఆయన వివరించారు. పథకానికి సంబంధించి వివరాలను వాలంటీర్లు, కార్యదర్సులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారి వద్ద పొందవచ్చని ఆయన సూచించారు. మూడు చక్రాలు, నాలుగు చక్రాల గూడ్స్ వాహనదారులకు ఈ పథకానికి అర్హత లేదని ఆయన స్పష్టం చేశారు. గత సంవత్సరం ఈ పథకం ద్వారా లబ్ధి పొందిన వాహనదారులు ప్రస్తుతం దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని, పదివేల రూపాయలు వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ అవుతుందని ఆయన పేర్కొన్నారు. తమ పేర్లను సంబంధిత గ్రామ, వార్డు సచివాలయం నోటీసు బోర్డు జాబితాలో తనిఖీ చేసుకోవాలని సూచించారు. జాబితాలో పేర్లు లేనప్పుడు సంబంధిత వివరాలు వాలంటీర్, కార్యదర్శులకు సమర్పించాలని చెప్పారు. ఈ పథకానికి అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులను వాలంటీర్లు, కార్యదర్శుల వద్ద పొంది, ఈనెల ఏడో తేదీలోగా సమర్పించాలని పేర్కొన్నారు. దరఖాస్తుతోపాటు ఆధార్ కార్డు, బియ్యం కార్డు, వాహన రిజిస్ట్రేషన్ పత్రము, వాహనానికి సంబంధించిన ఇతర పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్, రుణం లేని బ్యాంకు పాస్ బుక్ మొదటి పేజీ, కుల ధ్రువీకరణ పత్రం తదితర పత్రాలను సమర్పించాలని ఆయన అన్నారు. వాహనం భార్య పేరిట ఉండి ఆమెకు డ్రైవింగ్ లైసెన్స్ లేనప్పుడు భర్త డ్రైవింగ్ లైసెన్స్ తో దరఖాస్తు చేసే అవకాశం ఉందని., తల్లి, తండ్రి, కూతురు, సోదరులు పేరు మీద వాహనం ఉండి డ్రైవింగ్ లైసెన్స్ కుమారుడి పేరన ఉన్నప్పటికి ఈ పథకానికి అర్హులని ఆయన చెప్పారు. ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.