రహదారి నిర్మాణాలు వేగం పెంచండి..


Ens Balu
3
Mangalagiri
2021-06-02 14:06:25

గుంటూరు జిల్లా మంగళగిరిలోని  ఆలిండియా ఇనిస్ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) కు జాతీయ రహదారి వైపు నుంచి, మంళగగిరి వైపు నుంచి ఏర్పాటు చేస్తున్న రహదారుల నిర్మాణం, విస్తరణ పనులు వెంటనే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ అధికారులను ఆదేశించారు. బుధవారం మంగళగిరిలోని ఎయిమ్స్లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న రహదారుల పనులు, విస్తరణ పనులు, మంచినీరు, డ్రైనేజీ పనులను జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ పరిశీలించారు. జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ తొలుత ఎయిమ్స్ డైరక్టర్ ముఖేష్ త్రిపాఠితో కలిసి పెండింగ్ పనులపై చర్చించారు. ఎయిమ్స్లో ఓపిడీ బ్లాక్ను, రేడియాలజీ విభాగంలోని అల్ట్రాసౌండ్ స్కానింగ్, డిజిటల్ మోమోగ్రఫీ, డిజిటల్ రేడియోగ్రఫీ ఎక్విప్మెంట్ను జిల్లా కలెక్టర్  పరిశీలించారు. జాతీయ రహదారి వైపు నుంచి ఎయిమ్స్ ప్రధాన ద్వారం వరకు ఏర్పాటు చేస్తున్న ఆర్ అండ్ బీ రహదారిని, రహదారి విస్తరణ కోసం సేకరించాల్సిన అటవీ భూములను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ ఎయిమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ రాకేష్ కక్కర్ తో కలసి మంగళగిరి, తాడేపల్లి నగరపాలక సంస్థ అధికారులు, రెవెన్యూ అధికారులు, ఆర్ అండ్ బీ, ఫారెస్ట్, పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ మాట్లాడుతూ ఎయిమ్స్కు మంగళగిరి వైపు నుంచి ఉన్న రహదారి విస్తరణకు వెంటనే ప్రతిపాదనలు అందించి పనులు ప్రారంభించాలన్నారు. మంగళగిరి వైపు ఉన్న రహదారి రికార్డులను ఫారెస్ట్ అధికారులకు అందించాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. ప్రధాన ద్వారం వద్ద రహదారి విస్తరణకు అవసరమైన అటవీ భూముల సేకరణకు వెంటనే సర్వే చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందించాలన్నారు. జాతీయ రహదారి నుంచి ఎయిమ్స్కు వచ్చే రహదారి వద్ద ఉన్న డంపింగ్ యార్డు వెంటనే వేరే ప్రాంతానికి తరలించాలన్నారు. డంపింగ్ యార్డులో ఉన్న చెత్తను శుభ్రం చేసి అక్కడ మొక్కలు నాటాలని మంగళగిరి, తాడేపల్లి నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు. ఎయిమ్స్కు ప్రస్తుతం ట్యాంకర్లు ద్వారా సరఫరా చేస్తున్న నీటి కంటే అవసరమైతే అదనంగా ట్యాంకర్లు ద్వారా నీటి సరఫరా చేయాలన్నారు. ఎయిమ్స్కు రాష్ట్ర ప్రభుత్వం తరుపున చేపట్టాల్సిన అన్ని పనులు వేగవంతంగా పూర్తి చేసేందుకు రెవెన్యూ, ఫారెస్ట్, మంగళగిరి, తాడేపల్లి నగరపాలక సంస్థ ,ఆర్ అండ్ బీ అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలన్నారు. 

    సమావేశం అనంతరం జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ విలేకరులతో మాట్లాడుతూ జాతీయ స్థాయి అత్యున్నత వైద్య సంస్థ ఆలిండియా ఇనిస్ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (ఎయిమ్స్) మంగళగిరిలో ఏర్పాటు చేయటం ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి వస్తున్నాయన్నారు. ఎయిమ్స్ ఇన్ఫ్రాస్టక్చర్కు సంబంధించి 90 నుంచి 95 శాతం పనులు పూర్తి ఆయ్యాయని, ఓపిడీ సేవలు ప్రారంభించటం జరిగిందన్నారు. ఎయిమ్స్లో రాష్ట్ర ప్రభుత్వం తరుపున చేపట్టాల్సిన పనులలో ఉన్న చిన్న చిన్న సమస్యలను ప్రభుత్వ స్థాయిలో చర్చించి పరిష్కరించేందుకు ఎయిమ్స్ అదికారులతో పాటు, సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించటం జరిగిందన్నారు. రహదారుల విస్తరణ, ఫారెస్ట్ భూముల సేకరణ. నీటి సరఫరా, డ్రైనేజీ తదితర అంశాల పై చర్చించి అధికారులకు ఆదేశాలు జారీ చేయటం జరిగిందన్నారు.  ఎయిమ్స్కు నీటి సరఫరాకు, డ్రైనేజీ నిర్మాణానికి రూ.10 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించటం జరిగిందని, అనుమతి రాగానే పనులు ప్రారంభిస్తామని, అప్పటి వరకు తాత్కలికంగా అవసరం మేరకు ట్యాంకర్లు ద్వారా నీటిని సరఫరా చేస్తున్నామన్నారు.

    ఈ కార్యక్రమంలో జిల్లా అటవీశాఖ అధికారి ఎన్ రామచంద్రరావు, ఆర్ అండ్ బీ ఎస్ఈ మాధవి సుకన్య, మంగళగిరి, తాడేపల్లి నగరపాలక సంస్థ కమిషనర్ నిరంజన్ రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ హేమమాలిని, డిప్యూటీ కమిషనర్ రవిచంద్రారెడ్డి, గుంటూరు ఆర్డీవో భాస్కర రెడ్డి, జాతీయ రహదారుల ప్రాజెక్టు డైరక్టర్ శ్రీనివాస్, మంగళగిరి తహశీల్దారు రాం ప్రసాదు, తాడేపల్లి తహశీల్దారు శ్రీనివాసరెడ్డి, పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ అధికారులు, ఎయిమ్స్ అధికారులు పాల్గొన్నారు.