సకాలంలో వైఎస్సార్ కాలనీలు పూర్తి..
Ens Balu
1
Kakinada
2021-06-03 12:39:07
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వైఎస్సార్ జగనన్న కాలనీల్లో గృహ నిర్మాణాలను త్వరితగతిన పూర్తిచేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. గురువారం ఉదయం అదనపు కమిషనర్ సీహెచ్ నాగనరసింహారావు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు, అధికారులతో కలిసి కమిషనర్ కొమరగిరి లేఅవుట్‌లో ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. లబ్ధిదారులకు సిమెంట్, ఇసుక కూపన్లను అందించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం కింద కొమరగిరి లేఅవుట్‌లో 16 వేల ఇళ్ల నిర్మాణాలు దశల వారీగా జరగనున్నాయని, నిర్మాణానికి అవసరమైన నీరు, కరెంటు, రహదారులు తదితర సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. ఇసుక, సిమెంట్ వంటి నిర్మాణ సామగ్రి లేఅవుట్‌లో అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. బీచ్‌కు అభిముఖంగా, పచ్చదనం మధ్యగల భారీ లేఅవుట్‌లో ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు లబ్ధిదారులు కూడా త్వరితగతిన ముందుకురావాలని సూచించారు. ఇప్పటికే లేఅవుట్లో 27 వరకు ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని, గురువారం మరో 60 ఇళ్లకు శంకుస్థాపనలు జరిగినట్లు తెలిపారు. వారం రోజుల్లో 200 వరకు నిర్మాణాలు చేపట్టాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు వెల్లడించారు. ఇళ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తిచేసేందుకు హౌసింగ్, రెవెన్యూ, ఆర్‌డబ్ల్యూఎస్, విద్యుత్ తదితర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కమిషనర్ సూచించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు చంద్రకళాదీప్తి, ఎన్.సుజాత, గద్దేపల్లి దానమ్మ, కాకినాడ అర్బన్ తహసీల్దార్ వైహెచ్ఎస్ సతీశ్, హౌసింగ్ ఏఈ కె.అప్పారావు తదితరులు పాల్గొన్నారు.