పిల్లలు, గర్భిణీలకు బలవర్ధక బియ్యం..


Ens Balu
2
Vizianagaram
2021-06-03 12:42:42

మెరుగైన పోష‌కాహారాన్ని అందించే ల‌క్ష్యంతో, ఈ నెల నుంచి ప్ర‌స్తుతం ఉన్న సార్టెక్స్ బియ్యానికి బ‌దులు, అన్ని పోష‌కాల‌తో కూడిన బ‌ల‌వ‌ర్థ‌క బియ్యాన్ని పిల్ల‌ల‌కు, గ‌ర్భిణుల‌కు, బాలింత‌ల‌కు స‌ర‌ఫ‌రా చేస్తున్నామని జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. బ‌ల‌వ‌ర్థ‌క బియ్యం పంపిణీ ద్వారా 50,675 మంది 3-6 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సుగ‌ల పిల్ల‌లు, 32,493 మంది గ‌ర్భిణీస్త్రీలు, బాలింత‌ల‌కు ప్ర‌యోజ‌నం చేకూరుతుంద‌ని తెలిపారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ స్టేట్ సివిల్ స‌ప్ల‌యిస్ కార్పొరేష‌న్ ద్వారా ఈ నెల నుంచే బ‌ల‌వ‌ర్థ‌క బియ్యాన్ని అంగ‌న్‌వాడీ కేంద్రాల‌కు స‌ర‌ఫ‌రా చేసేందుకు జిల్లా మ‌హిళాభివృద్ది, శిశు సంక్షేమ‌శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింద‌ని తెలిపారు. ఈ బియ్యంలో విట‌మిన్లు, ఖ‌నిజాలు త‌దిత‌ర పోష‌కాలు మిళిత‌మై ఉంటాయ‌న్నారు. ముఖ్యంగా ఈ బ‌ల‌వ‌ర్థ‌క బియ్యంలో ఐర‌న్‌, ఫోలిక్ యాసిడ్‌, ఎదుగుద‌ల‌కు స‌హాయ‌ప‌డే బి12 విట‌మిన్లు, నాడీ వ్య‌వ‌స్థ అభివృద్దికి దోహ‌ద‌డ‌పే సూక్ష్మ పోష‌కాలు ఉంటాయ‌ని తెలిపారు. ఈ బియ్యాన్ని ఆహారంగా తీసుకోవ‌డం ద్వారా పోష‌కాహార లోపాలు తొల‌గి, వారి ఆరోగ్యం మ‌రింత మెరుగుప‌డుతుంద‌ని పేర్కొన్నారు.