సచివాలయాల్లో సత్వరమే సేవలందాలి..
Ens Balu
1
విశాఖ సిటీ
2021-06-03 12:53:09
మహావిశాఖ నగర పాలక సంస్థ పరిధిలోని వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన అధికారులను ఆదేశించారు. గురువారం ఆమె రెండవ జోన్ 6వ వార్డులోని మదురవాడలో బక్కన్నపాలెం ఎస్.సి. కోలనీ తదితర ప్రాంతాలలో పర్యటించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సచివాలయాల ద్వారా ప్రజలకు మరిన్ని సేవలు అందించాలన్నారు. 42వ సచివాలయ పరిధిలో డోర్ టు డోర్ చెత్త సేకరణ. తడి-పొడి చెత్త సేకరణ, రోడ్లు, కాలువలు శుభ్రం చేయడం వంటి కార్యక్రమాలు నూరు శాతం అమలు చేస్తున్నారని స్థానిక ప్రజలు తెలపగా ఆ వార్డు శానిటరి ఇన్స్పెక్టర్ సంతోష్, శానిటరి కార్యదర్శి టి. జానకీ కుమారిను కమిషనర్ అభినందించారు. ఇదే స్ఫూర్తి తో జివిఎంసి పరిధిలో ఉన్న అన్ని సచివాలయాల కార్యదర్శులు నిబద్దతతో పనిచేసి ప్రజల మన్ననలను పొందాలని కమిషనర్ తెలిపారు. ప్రతి రోజు సేకరించిన చెత్తను డంపింగు యార్డుకు తరలించాలని ఆదేశించారు. ప్రతీ దుకాణాల ముందు మూడు రంగుల చెత్త బుట్టలు ఉండాలని, నిషేదిత ప్లాస్టిక్, క్యారీ బ్యాగులు అమ్మరాదని, అమ్మిన యడల వారికి జరిమానా విధించాలని శానిటరి ఇన్స్పెక్టర్ ను ఆదేశించారు. ప్రతీ రోజు త్రాగు నీరు వస్తున్నదీ లేనిదీ ప్రజలను అడిగి తెలుసుకున్నారు. స్ట్రీట్ లైట్స్ వెలగడం లేదని స్థానిక ప్రజలు కమిషనర్ దృష్టికి తీసుకురాగా వెంటనే అన్ని లైట్స్ వెలిగేలా చూడాలని ఎలక్ట్రికల్ విభాగపు సహాయక ఇంజినీరును ఆదేశించారు. సీజనల్ వ్యాధులైన డెంగ్యూ, మలేరియా వ్యాధులు ప్రబలకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సీజనల్ వ్యాదులపై ఇంటింట సర్వే జరపాలని వెటర్నరి డాక్టరు కిషోర్ ను ఆదేశించారు. ఇంటి ఆవరణలోను, కుండీలలోను నీరు నిల్వ ఉంచకుండా ప్రతి శుక్రవారం “డ్రై” డే పాటించాలని సూచించారు. ఈ పర్యటనలో ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, జోనల్ కమిషనర్ బి. రాము, వెటర్నరి డాక్టరు కిషోర్, కార్యనిర్వాహక ఇంజినీర్లు చిరంజీవి, సుధాకర్, ఉప కార్యనిర్వాహక ఇంజినీరు వంశీ, సహాయక ఇంజినీర్లు, శానిటరి సూపర్వైజర్, శానిటరి ఇన్స్పెక్టర్, వార్డు సచివాలయ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.