భావితరాల బంగారు భవిష్యత్ లక్ష్యంగా.. ఆరోగ్యకర సమాజాన్ని సాకారం చేసే దిశగా.. తల్లిగర్భం నుంచే సంపూర్ణ ఆరోగ్యానికి పునాది వేయాలనే సంకల్పంతో పోషక బియ్యాన్ని (ఫోర్టిఫైడ్ రైస్) ఈ నెల నుంచి అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలకు పంపిణీకి శ్రీకారం చుట్టినట్లు కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి తెలిపారు. గురువారం కాకినాడలోని క్యాంపు కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డా. జి.లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) కీర్తి చేకూరి, అధికారులతో కలిసి కలెక్టర్ మురళీధర్‌రెడ్డి ఫోర్టిఫైడ్ బియ్యంపై అవగాహన కల్పించేందుకు రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలతో పాటు అంగన్‌వాడీలు, పాఠశాలల్లోని చిన్నారుల్లో పోషకాల లేమిని నివారించేందుకు ఈ పోషక బియ్యం ఉపయోగపడతాయని తెలిపారు. సాధారణ బియ్యానికి అదనంగా ఆరోగ్యానికి అవసరమైన విటమిన్లు, ఖనిజలవణాలను చేర్చడం ద్వారా ఫోర్టిఫైడ్ బియ్యం తయారవుతాయని, వంద గ్రాముల ఫోర్టిఫైడ్ బియ్యంలో ఐరన్ 4.25 మిల్లీ గ్రాములు, ఫోలిక్ యాసిడ్ 12.5 మైక్రో గ్రాములు, విటమిన్ (బీ12) 0.125 మైక్రోగ్రాములు ఉంటాయని వివరించారు. రక్తహీనత నివారణకు ఐరన్, గర్భస్థ శిశు వికాసానికి ఫోలిక్ ఆమ్లం, నాడీ వ్యవస్థ అభివృద్ధికి విటమిన్ బీ12 ఉపయోగపడతాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు తూర్పుగోదావరి జిల్లాలో మహిళలు, చిన్నారులకు సమతుల పోషకాహారం అందించేందుకు 5,546 అంగన్‌వాడీ కేంద్రాలకు, 3,542 పాఠశాలలకు మధ్యాహ్నభోజన పథకానికి ఫోర్టిఫైడ్ బియ్యాన్ని అందించనున్నట్లు తెలిపారు. ప్రతి నెలా అంగన్‌వాడీ కేంద్రాలకు 3,595 క్వింటాళ్లు, పాఠశాలలకు 5,438 క్వింటాళ్ల పోషక బియ్యాన్ని పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. 100 కిలోల సాధారణ బియ్యంలో ఒక కిలో ఫోర్టిఫైడ్ బియ్యాన్ని కలిపి పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.
జాయింట్ కలెక్టర్ డా. జి.లక్ష్మీశ మాట్లాడుతూ జిల్లాలోని 21 పౌర సరఫరా మండలస్థాయి గోదాముల నుంచి 2,659 చౌక ధరల దుకాణాల ద్వారా ఫోర్టిఫైడ్ బియ్యాన్ని పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో ఖరీఫ్ సీజన్‌లో 76,350 టన్నుల ఫోర్టిఫైడ్ బియ్యాన్ని తయారుచేయించి 38 వేల టన్నులను విజయనగరం జిల్లాకు, 30 వేల టన్నులను ఎనిమిది ఇతర జిల్లాలకు పంపినట్లు తెలిపారు. కార్యక్రమంలో సివిల్‌సప్లయ్స్ డీఎం ఇ.లక్ష్మీరెడ్డి, డీఎస్‌వో పి.ప్రసాదరావు, ఐసీడీఎస్ పీడీ జీవీ సత్యవాణి, ఏడీ (మిడ్ డే మీల్స్) పి.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.