బ్లాక్ ఫంగస్ రాకుండా ముందుగా సూచించండి..


Ens Balu
3
Srikakulam
2021-06-03 13:41:20

శ్రీకాకుళం జిల్లాలో బ్లాక్ ఫంగస్ వ్యాప్తి కాకుండా ముందస్తు సూచనలు చేయాలని వైద్యులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన క్రిష్ణ దాస్ కోరారు. పలువురు బ్లాక్ ఫంగస్ భారీన పడటం జరుగుతోందని దానిని నివారించుటకు గల అవకాశాలు పరిశీలించాలని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో వైద్యులతో కరోనా, బ్లాక్ ఫంగస్ తదితర అంశాలపై గురు వారం ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్య మంత్రి మాట్లాడుతూ వైద్యానికి అత్యంత ప్రాధాన్యతను ప్రభుత్వం ఇస్తుందన్నారు. వైద్యుడు దేవునితో సమానంగా అందరూ భావిస్తారని ఇదే క్రమంలో కోవిడ్ లో వైద్యులు చాలా కష్టపడి పనిచేస్తున్నారని ప్రశంసించారు. వైద్యులు అందిస్తున్న సేవలు వలన ప్రభుత్వానికి గౌరవం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో జిల్లా కలెక్టర్, వైద్యులు మంచి సమన్వయంతో పనిచేస్తున్నారని ప్రతి అంశాన్ని విజయవంతంగా పరిష్కరిస్తున్నారని అన్నారు. రాష్ట్ర పురోగతిలో కరోనా మహమ్మారి పెద్ద ఆటంకంగా మారిందని దానిని కూడా అధిగమించే విధంగా వైద్యులు పనిచేస్తున్నారని చెప్పారు. కరోనా, బ్లాక్ ఫంగస్ చికిత్సలో ప్రతి అవకాశాన్ని వినియోగించుకుందామని, ఎంత ఖర్చు అయినా భరించుటకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. స్ఫూర్తివంతమైన సేవలు అందించి ప్రజల గుండెల్లో నిలవాలని పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ సమర్ధవంతంగా పనిచేస్తున్నారని కితాబు ఇచ్చారు.

      రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి డా.సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చిన వారికి పడకల ఏర్పాటులో పక్కాగా ఉండాలన్నారు. ఆరోగ్య శ్రీ క్రింద చేరే వారికి పడకలు కేటాయించే అంశంపై తగు అవగాహన కలిగించాలని అన్నారు. ప్రభుత్వం ఆరోగ్య శ్రీ క్రింద కరోనా చికిత్స అందించుటకు చిత్తశుద్ధితో ఉందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రం మొత్తం మీద రెండవ దఫా కరోనాలో జిల్లా యంత్రాంగం సమన్వయంతో అద్భుతంగా పనిచేసిందని, ఎక్కడా ఎటువంటి సమస్య లేకుండా నిర్వహించారని అభినందించారు. లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన వైద్యులు, పారామెడికల్ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.

        జిల్లా కలెక్టర్ జె నివాస్ మాట్లాడుతూ కోవిడ్ చికిత్స అనంతరం బ్లాక్ ఫంగస్ సమస్య తలెత్తుతుందన్నారు. బ్లాక్ ఫంగస్ చికిత్సకు ప్రత్యేకంగా పడకలు కేటాయించామని పేర్కొన్నారు. అవసరమగు మందులను ప్రభుత్వం సరఫరా చేసిందని చెప్పారు. చిన్నపిల్లల్లో కరోనా కేసులు వస్తున్నాయని, వాటికి మంచి చికిత్స అందిస్తున్నామని చెప్పారు. పిల్లలు త్వరగా వైద్యానికి స్పందిస్తున్నారని చెప్పారు. జిల్లాలో చిన్నారులకు సంబంధించిన వెంటిలేటర్లు ఇతర సామగ్రి కొంత మేర అవసరం ఉందని సూచించారు. జిల్లాలో ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని చెప్పారు. ఆక్సిజన్ లో స్వయం సమృద్ది దిశగా అడుగులు వేస్తున్నామని, పి.ఎస్.ఏ ప్లాంట్లను ఏర్పాటు చేయుటకు చర్యలు చేస్తున్నామని వివరించారు. రిమ్స్ లో ఆక్సిజన్ పడకలకు ఆక్సిజన్ పూర్తి స్ధాయిలో అందించగలమని చెప్పారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా.ఏ.కృష్ణ వేణి, వైద్యులు పాల్గొన్నారు.