వచ్చే జూన్ నాటికి ఇళ్లు పూర్తిచేస్తాం..


Ens Balu
1
Bheemili
2021-06-03 13:46:07

 రాష్ట్రంలో మొదటి దశ గృహ నిర్మాణాలు 2022-జూన్ నాటికి యుద్దప్రాతిపదికన పూర్తి చేయనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు.  గురువారం ఆయన తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి గృహ నిర్మాణాలకు వర్చ్యువల్ విధానంలో ఆయన శంకుస్థాపన చేశారు.  జిల్లాలో ఈ కార్యక్రమం భీమిలి నియోజక వర్గం వెల్లంకి గ్రామంలో ఏర్పాటు చేశారు.  రాష్ట్రంలో 17 వేల జగనన్న కాలనీలు వస్తున్నాయన్నారు.  ప్రణాళికా బద్దమైన కాలనీలు నిర్మాణం జరుగుతుందని, ప్రతి ఇంటికి తాగునీరు, భూగర్భ డ్రైనేజి, భూ గర్భ విద్యుత్ లైన్లు, భూ గర్భ ఇంటర్ నెట్ వంటి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు.  రాష్ట్రంలో 31 లక్షల కుటుంబాలకు స్థిరాస్థి ఉంటుందని చెప్పారు. లబ్దిదారులు స్వయానా నిర్మించుకొంటామంటే వారికి నాణ్యమైన సిమెంటు, ఇనుములను సరసమైన ధరలకు ప్రభుత్వమే సరఫరా చేస్తుందని, ఇందుకు గ్రామ స్థాయిలో గోడౌన్లు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.  ప్రతి జిల్లాకు గృహ నిర్మాణాలు చూసుకొనేందుకు ఒక జాయింట్ కలెక్టర్ ను నియమించనున్నట్లు వెల్లడించారు.  అర్హత గల ప్రతి లబ్దిదారునికి ఇళ్ల పట్టాలు జారీ చేసి గృహ నిర్మాణాలు చేస్తామన్నారు. ఎవరైనా తప్పిపోతే అలాంటి వారు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకొంటే పరిశీలన చేసి అర్హత గల లబ్దిదారులైతే 90 రోజుల్లో ఇళ్ల పట్టాలు జారీ చేస్తారని తెలిపారు.  
  అనంతరం భీమిలి నియోజక వర్గం  ఆనందపురం మండలం వెల్లంకి గ్రామంలో  మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు 303 గృహాలకు భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో  జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్, జాయింట్ కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి, ఆర్డిఓ పెంచల కిషోర్, గృహ నిర్మాణ శాఖ పిడి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో జిల్లాలో మొదటి దశలో 5 వేల గృహాలకు, 90 కోట్లు రూపాయలు అంచనా విలువతో నిర్మాణాలు చేపట్టనున్నట్లు తెలిపారు.  వారం రోజుల పాటు గృహ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమాలు ఉంటాయని, భీమిలి నియోజక వర్గం ఆనందపురం మండలం వెల్లంకి గ్రామంలో 303 గృహాలకు శంఖుస్థాపన చేయడమైనదని, 5.45 కోట్ల రూపాయల అంచనా విలువతో నిర్మించడం జరుగుతుదరన్నారు. ప్రైవేటు లే అఔట్ లలో ఉన్నట్లుగానే గృహాల నిర్మాణాలు, భూ గర్భ డ్రైనేజి, విద్యుత్, ఇంటర్ నెట్ ఇతర మౌలిక సదుపాయాలు ఉంటాయని తెలిపారు.  ఒక్కొక్కరికి ఇంటి స్థలం, గృహం నిర్మాణం కలిపి 5 లక్షలు నుండి 15 లక్షల రూపాయలు విలువ చేసే ఇళ్లు  ఉంటుందని చెప్పారు.  పాదయాత్రంలో ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చుతున్నారని తెలిపారు.  జిల్లాకు అత్యధిక గృహాలు మంజూరుకు అధికారుల కృషి చేశారని, ఇళ్ల స్థలాలు మంజూరు పారదర్శకంగా జరిగిందన్నారు.  
  జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ మాట్లాడుతూ గృహ నిర్మాణాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి వర్య్చువల్ విధానంలో ప్రారంభించినట్లు చెప్పారు.  జిల్లాలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రారంభించినట్లు పేర్కొన్నారు.  జిల్లాలో గృహాలు నిర్మాణాలకు లబ్దిదారులు ఎవరైనా ముందుకు వస్తే అలాంటి వారికి నాణ్యమైన మెటీయల్ సరసమైన ధరలకు ప్రభుత్వమే ఇస్తుందని చెప్పారు.   హౌసింగ్ పై  ఒక జాయింట్ కలెక్టర్ ను ప్రభుత్వం నియమిస్తుందని వెల్లడించారు.  కోర్టు కేసులు ఉన్న ఇంటి స్థలాలు కోవిడ్ కారణంగా కోర్టులు జరుగుటలేదని, కోర్టు కేసులు పూర్తి చేసుకొని త్వరితగతిన  ఇళ్ల నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందన్నారు.