వాహన మిత్ర దరఖాస్తులు సత్వరం అప్లోడ్ చేయాలి..


Ens Balu
2
Anantapur
2021-06-03 14:12:30

వాహన మిత్ర పథకం కింద లబ్ధి పొందేందుకు దరఖాస్తు చేసుకునే దరఖాస్తులను నిర్దేశిత గడువులోగా పరిశీలించి అప్లోడ్ చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు.గురువారం మధ్యాహ్నం వాహన మిత్ర దరఖాస్తుల పరిశీలన మరియు సకాలంలో అప్లోడ్ చేసే అంశంపై జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) గంగాధర్ గౌడ్ తో కలిసి డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్,మున్సిపల్ ఆర్డీ,జిల్లాలోని ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు,వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు, వార్డ్ వెల్ఫేర్ మరియు డెవలప్మెంట్ సెక్రెటరీ లతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ,ఈనెల 15వ తేదీన ముఖ్యమంత్రి చేతుల మీదుగా మూడో విడత వాహన మిత్ర లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందన్నారు. ఇందుకు సంబంధించి ఈనెల 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు  గ్రామ,వార్డు సచివాలయం పరిధిలో అందే దరఖాస్తులను నిర్దేశిత గడువులోగా పరిశీలించి అప్లోడ్ చేయాలన్నారు. దరఖాస్తుల పరిశీలనకు వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు, వార్డ్ వెల్ఫేర్ మరియు డెవలప్మెంట్ సెక్రెటరీ లకు రెండు రోజుల గడువు మాత్రమే ఉందన్నారు.ఆ గడువులోపు వారికి అందిన దరఖాస్తులు అన్నింటిని ప్రభుత్వం జారీ చేసిన నియమ నిబంధనల మేరకు పరిశీలించి అప్లోడ్ చేయాలన్నారు.అలాగే ఎంపీడీవోలు మున్సిపల్ కమిషనర్లకు కూడా ఈనెల 10,11తేదీ లోపు వారి పరిధిలో ఉన్న దరఖాస్తులలో 2 శాతం దరఖాస్తులను భౌతికంగా తనిఖీ చేయాలన్నారు. వారు ఈనెల 11వ తేదీ లోపు దరఖాస్తులను పరిశీలించి అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నారు.

 ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ గంగాధర్ గౌడ్ మాట్లాడుతూ, దరఖాస్తులు పరిశీలనకు తక్కువ వ్యవధి ఉన్నందున ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు,వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు, వార్డ్ వెల్ఫేర్ మరియు డెవలప్మెంట్ సెక్రెటరీలు వారికి నిర్దేశించిన గడువులోపు దరఖాస్తులను పరిశీలించాలన్నారు.లబ్ధిదారుల జాబితాను వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్లో ఉంచడం జరిగిందన్నారు.సొంతంగా ఆటో, టాక్సీ ,క్యాబ్, లైట్ వెహికల్ గూడ్స్ నడిపేవారు, ఆధార్ కార్డు,తెల్ల రేషన్ కార్డు, అంత్యోదయ, అన్నపూర్ణ కార్డులు కలిగి ఉన్న వారందరూ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. వాళ్ళ కుటుంబంలో ఒకరికి మాత్రమే లబ్ధి పొందేందుకు వీలుందన్నారు.పైన పేర్కొన్న అధికారులనుండి అందిన అప్లికేషన్లకు సంబంధించి ఈ నెల 12వ తేదీన జిల్లా కలెక్టర్ ఆమోదించి 13,14 తేదీలలో ఉత్తర్వులు జారీ చేయడం జరుగుతుందన్నారు.

డిటిసి శివరాంకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ, వాహన మిత్ర పథకం కింద లబ్ధి పొందేందుకు గతంలో ఉన్న నియమ నిబంధనలతోపాటు ప్రభుత్వం మరో ఆరు నిబంధనను చేర్చిందన్నారు.దరఖాస్తుదారుడురాష్ట్ర ప్రభుత్వం అందించే ఏ ఇతర ప్రభుత్వ పథకం ద్వారా లబ్ధి పొంది ఉండరాదన్నారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉండరాదని,ఆదాయ పన్ను చెల్లించే వారు అనర్హులని,300 యూనిట్లు పైబడి విద్యుత్ వాడేవారు, మూడెకరాల వ్యవసాయ భూమి, 10 ఎకరాల మెట్ట భూమి లేదా పది ఎకరాల వ్యవసాయ మరియు మెట్ట భూమి కలిగిన వారు అనర్హులన్నారు. అలాగే మున్సిపల్ ప్రాంతంలో వెయ్యి అడుగుల గృహ మరియు వాణిజ్య స్థలం కలిగి ఉన్నవారు కూడా అనర్హులన్నారు. అయితే శానిటరీ వర్కర్లు సంబంధించి వారి కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి ఉన్నప్పటికీ వారికి మినహాయింపు ఇచ్చారన్నారు.ఏరోజుకారోజు అండే దరఖాస్తు లన్నింటినీ ఎప్పటికప్పుడు పరిశీలించి వెంటనే అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నారు.జిల్లాలో మొదటి విడతలో11,301 మందికి,రెండవ విడతలో13,200 మందికి ఈ పథకం ద్వారా లబ్ధి కలిగించడం జరిగిందన్నారు.  ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఆర్డీ నాగరాజు పాల్గొన్నారు.