మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని పార్కులు అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయడానికి వీలుగా ప్రణాళికలు సిద్ధం చేయాలని జివిఎంసి కమిషనర్ డా. జి సృజన అధికారులను ఆదేశించారు. గురువారం ఆమె శివాజీ పార్క్ లోని హార్టికల్చర్, ఇంజనీరింగ్ విభాగాల అధికారులతో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శివాజీ పార్కుతో పాటు జివిఎంసి పరిధిలోని సుమారు 170 కోలనీ పార్కులను ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం అభివృద్ధి చేశారని వాటిని నూతన హంగులతో ఆకర్షణీయంగా మార్పులు చేయడానికి గల అవకాశాలను పరిశీలించాలని ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, వివిధ ప్రతిభావంతులకు ఉపయోగపడే విధంగా పార్క్ లను ఒకటికి పది సార్లు సందర్శకులు వచ్చి చూసే విధంగా తీర్చిదిద్దడానికి అధ్యయనం చేసి ఒక ప్రణాళికతో ముందుకు రావాలని ఆదేశించారు. పార్కులో వినూత్న సౌకర్యాలు కలిగి ఆర్గానిక్ పార్కు, ట్రాఫిక్ రూల్స్ మొదలైనవి ఏర్పాటు చేయాలని, అవి పిల్లలు నేర్చుకొనే విధంగా ఉండాలని, పార్కుల అభివృద్ధి కొరకు ఇతర రాష్ట్రాలలోని కొన్ని పార్కులను అధ్యయనం చేసి రావాలని కమిషనర్ అధికారులకు సూచించారు.
ఈ పర్యటనలో ప్రధాన ఇంజినీరు పి. రవికృష్ణ రాజు, పర్యవేక్షక ఇంజినీర్లు వేణుగోపాల్, రాజా రావు, శ్యామ్సన్ రాజు, శివప్రసాద రాజు, రాయల్ బాబు, కార్యనిర్వాహక ఇంజినీరు (పి.ఎల్.& సి) మెహెర్ బాబా, అసిస్టెంట్ డైరక్టర్ ఆఫ్ హార్టికల్చర్ ఎం. దామోదర రావు తదితరులు పాల్గొన్నారు.