మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలోని అక్రమ నిర్మాణాలు కనిపిస్తే ఉపేక్షించేది లేదని జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన పట్టణ ప్రణాళికా అధికారులను హెచ్చరించారు. శుక్రవారం ఆమె చీఫ్ సిటీ ప్లాన్నర్ విద్యుల్లత, సిటీ ప్లానర్లు, ఎ.సి.పి., డి.సి.పి., టి.పి.ఒ. లు మరియు వార్డు సచివాలయ ప్లానింగు కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ముఖ్యంగా నగరంలో అనధికార నిర్మాణాలపై దృష్టి పెట్టాలని ఎటువంటి ఒత్తిళ్లకు లోను కావద్దని, వార్డు ప్లానింగు కార్యదర్శులను ఆదేశించారు. మీ మాట వినని యడల, పై అధికారుల దృష్టికి తీసుకురావాలని చాలా వరకు స్లాబ్ లెవెల్స్ వచ్చిన తరువాత గుర్తించి వాటిపై చర్యలు తీసుకునే బదులు గ్రౌండ్ లెవల్స్ లోనే గుర్తించి వాటిని ఆపాలని ఆదేశించారు. వార్డు ప్లానింగ్ కార్యదర్శులు రూల్ పొజిషన్ తెలుసుకోవాలని, ప్లాన్ ఇచ్చేముందు అన్ని డాక్యుమెంట్స్ సక్రమంగా ఉంటేనే ప్లాన్ ఇచ్చేందుకు ముందుకు వెళ్ళాలని సూచించారు. గతంలో ప్లానింగు అధికారులు చాలా తక్కువుగా ఉండేవారని, రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సౌకర్యార్ధం ప్రతీ సచివాలయానికి ఒక ప్లానింగు కార్యదర్శిని నియమించిందని మీ పరిధిలో ప్రతీ రోజు తిరిగినట్లయితే అనధికార కట్టడాలు ఉండవన్నారు. జివిఎంసి పరిధిలో 570 మంది ప్లానింగు కార్యదర్శులు ఉన్నారని, వారంతా నిబద్దతతో పని చేయాలని కమిషనర్ ఆదేశించారు. ప్రభుత్వ స్థలాలలో అక్రమ కట్టడాలు, దుకాణాలు, బడ్డీలు కనిపిస్తే మొదటిగా వార్డు ప్లానింగు కార్యదర్శిలే బాధ్యత వహించాల్సి ఉంటుందని కమిషనర్ హెచ్చరించారు. కొన్ని కూడళ్ళలో హాకర్సు జోన్లు ఏర్పాటు చేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా దుకాణాలన్ని ఒకే దగ్గర ఉండే విధంగా యు.సి.డి విభాగంతో కలసి పనిచేయాలని వారికి ఐ.డి. కార్డులు ఇవ్వాలని ఆదేశించారు. పట్టణ ప్రణాళికా అధికారులు ప్రతి రోజు వార్డులలో పర్యటించాలని కమిషనర్ ఆదేశించారు. నగరంలో హోర్డింగ్స్, బ్యానర్లు ఎక్కువగా దర్శనం ఇస్తున్నాయని, వాటిని నిర్మూలించాలని అధికారులను ఆదేశించారు. గతంలో సరిగా పని చేయని 12 మంది అధికారులను ప్రభుత్వానికి సరండర్ చేసానని, అయినా మీలో ఎటువంటి మార్పు రాలేదని టౌన్ ప్లానింగు అధికారులను హెచ్చరించారు. ప్రతి రోజు స్పందనలోను, సోషల్ మీడియాలోను, వాట్స్ యాప్ లోను, న్యూస్ పేపర్ క్లిప్పింగ్సు లోను యాడ్వర్స్ న్యూస్ కనిపిస్తే వాటిపై 24గంటలలో చర్యలు తీసుకోవాలని, రిపోర్టు ఇవ్వాలని ఆదేశించారు. గృహ నిర్మాణ వ్యర్ధాలను రోడ్డు ప్రక్కన డంపింగు చేస్తున్నారని, వాటిని గుర్తించాలని, భవనములు నిర్మించుటకు వాడే ఇసుక, పిక్క, బ్రిక్స్ లాంటివి రోడ్డుపై వేసి రోడ్లను బ్లాక్ చేస్తున్నారని వారిపై తగు చర్యలు తీసుకొని జరిమానా విధించాలని ఆదేశించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో చీఫ్ సిటీ ప్లాన్నర్ విద్యుల్లత తో పాటు సిటీ ప్లానర్లు, ఎ.సి.పి.లు, డి.సి.పి., టి.పి.ఒ.లు, వార్డు సచివాలయ ప్లానింగు కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.