అనవసరంగా బయటకు వస్తే పోలీసు కేసు...ఆర్డీఓ
Ens Balu
4
Srikakulam
2020-08-30 18:54:20
శ్రీకాకుళం పట్టణంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా మరిన్ని పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. కోవిడ్ వ్యాప్తిని అరికట్టుటలో ప్రజ లు భాగస్వామ్యం కావాలని కోరడంతోపాటు అనవసరంగా ఎట్టి పరిస్థితుల్లోనూ బయట తిరగరాదని సూచిస్తున్నారు. అనవసరంగా బయట తిరిగే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నిర్ణయించారంటే పరిస్థితి ఏవిధంగా అర్ధం చేసుకోవచ్చు. శ్రీకాకుళం పట్టణంలో కేసులు పెరుగుతున్న దృష్ట్యా రెవిన్యూ డివిజనల్ అధికారి ఐ.కిషోర్, పట్టణ పర్యవేక్షణ అధికారి టి.వేణుగోపాల్ నగర పాలక సంస్ధ అధికారులు, పోలీసు అధికారులు, పట్టణ ప్రత్యేక అధికారులు తదితర కోర్ కమిటి ఈ మేరకు నిర్ణయించింది. సోమ వారం నుండి రోజు వారీ వ్యాపార కార్యకలాపాలు యధావిధిగా ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే ఉంటుందని స్పష్టం చేసారు. మధ్యాహ్నం ఒంటి గంట తరువాత మందుల దుకాణాలు మినహా ఏ ఇతర దుకాణాలు, చిల్లర దుకాణాలతో సహా, తెరవడానికి వీల్లేదని స్పష్టం చేసారు. అమలులో ఉన్న 144 వ సెక్షన్ ను మరింత పకడ్బందీగా అమలు చేయుటకు నిర్ణయించారు. ఒంటి గంట తరువాత ఏ ఒక్క వ్యక్తి కూడా అనవ సరంగా బయట తిరగరాదని స్పష్టం చేసారు. కంటైన్మెంటు జోన్లలో తిరగడాన్ని మరింత కఠినంగా పర్యవేక్షించాలని సమావేశంలో నిర్ణయించారు. శ్రీకాకుళం పట్ట ణంలోకి ప్రవేశాన్ని మధ్యాహ్నం ఒంటి గంట నుండి మరుచటి రోజు ఉదయం 6 గంటల వరకు మరింత పక్కాగా పర్యవేక్షించుటకు సంకల్పించారు. శ్రీకాకుళం పట్ట ణంలోకి ప్రవేశించే ముఖ్యంగా ఆరు మార్గాలు – తోటపాలెం జంక్షన్, బలగ ఏసిబి కార్యాలయం మార్గం, పొన్నాడ బ్రిడ్జి, అరసవల్లి జంక్షన్, రామలక్ష్మణ జంక్షన్, కిల్లిపా లెం జంక్షన్ ను గుర్తించి, పనులు లేకుండా అనవసర రాకపోకలను నిరోధించుటకు చర్యలు చేపడుతున్నారు.