కరోనా పరీక్షలు మరింతగా పెంచండి..


Ens Balu
2
విశాఖ కలెక్టరేట్
2021-06-04 12:54:43

విశాఖజిల్లాలో కోవిడ్ వ్యాప్తిని అరికట్టడానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టర్ వైద్యాధికారులతో కలక్టరేట్ సమావేశ మందిరంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్, జిల్లాలో టెస్టింగ్ నిర్వహణ, టెస్టుల రిపోర్టులు, వ్యాక్సినేషన్, ఐసోలేషన్ కిట్స్ అందించడం, ఆక్సిజన్ సిలిండర్లు మొదలగు అంశాలపై సమీక్షించారు జిల్లాలో కోవిడ్ పరీక్షలు విస్తృతంగా నిర్వహించాలని పాజిటివ్ లను గుర్తించి వారికి అవసరమైన చికిత్సలు అందించడం ఖచ్చితంగా జరగాలన్నారు.

కోవిడ్-19 అరికట్టడానికి గానూ ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, శానిటైజర్ వాడడం  అందరూ తప్పక పాటించాలన్నారు. ఈ విషయాలపై విస్తృతంగా ప్రచారం గావించాలన్నారు. ఐసోలేషన్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కిట్స్ అందించాలని, ఇది సమస్య కారాదన్నారు. ఏజెన్సీలో పరీక్షల నిర్వహణ లాబ్ కి పంపి రిజల్ట్ తెలపడంలో ఆలస్యం జరుగుతోందని దీన్ని నివారించాలన్నారు. ఇందుకుగాను మధ్యాహ్నం వరకు టెస్టింగ్ చేసి వాటిని పాడేరు, అరకు మండల కేంద్రాల నుండి రెండు వాహనాల్లో సేకరణ చేసి తీసుకురావడానికి తగు చర్యలు చేపట్టాలన్నారు. దీనివల్ల టెస్ట్ శాంపిల్స్ కలెక్ట్ చేసిన పిదప రిజల్ట్ ఆలస్యము నివారించవచ్చన్నారు.  జిల్లా వ్యాప్తంగా రేపటి నుండి రోజుకు పది వేల పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.
  కోవిడ్ పరీక్షల నిర్వహణ రిజల్ట్ వెల్లడిలో సూక్ష్మ స్థాయిలో సమస్యలు గుర్తించి పరిష్కరించాలన్నారు. 104 కాల్ సెంటర్ ను కోవిడ్ లక్షణాలు ఉన్నవారు సంప్రదించి సహకారం పొందాలన్నారు.

వ్యాక్సినేషన్ : జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం గావించాలన్నారు. ఏవైనా సంస్థలు ప్రైవేటు ఆసుపత్రులలో వారి సిబ్బందికి పరీక్షలు చేయించుకుంటామని ముందుకు వస్తే అనుమతించాలన్నారు. ఈ విషయంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి తగు చర్యలు తీసుకోవాలన్నారు కోవిడ్ వర్కర్స్, స్టాఫ్ నర్సులు, పారామెడికల్ వైద్య సిబ్బంది జీతాల బిల్లును సత్వరమే తయారు చేసి సబ్మిట్ చేయాలని ఆదేశించారు

కోవిడ్ వలన తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు పేరిట రూ.10 లక్షల ఫిక్సిడ్ డిపాజిట్ చేయడానికి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తదుపరి ఆక్సిజన్ సిలిండర్ల లభ్యతపై చర్చించారు. పాడేరు జిల్లా ఆసుపత్రికి; అరకు ఏరియా ఆసుపత్రి మరియు సి.హెచ్.సి చింతపల్లికి ఆక్సిజన్ సిలిండర్లు పంపాలన్నారు.

ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు, ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.వి.సుధాకర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి  డాక్టర్ సూర్యనారాయణ, జిల్లా ఇమ్యూనైజేషన్ ఆఫీసరు జీవన్ రాణి, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ రామలింగరాజు, డాక్టర్ మురళీ మోహన్, డాక్టర్ వసుంధర తదితరులు హాజరయ్యారు.