పండుగలా జగనన్న కాలనీ నిర్మాణాలు..


Ens Balu
2
Ponnuru
2021-06-04 13:13:56

గుంటూరుజిల్లాలో నవరత్నాలు- పేదలందరికీ ఇళ్ళు నిర్మాణాల కార్యక్రమం పండుగ వాతావరణంలో జరుగుతున్నాయని  గుంటూరు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ అన్నారు. శుక్రవారం పొన్నూరు పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 99.89 ఎకరాల్లో  నవరత్నాలు- పేదలందరికీ ఇళ్ళు నిర్మాణ కార్యక్రమాన్ని పొన్నూరు శాసన సభ్యులు కిలారి వెంకట రోశయ్యతో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన లబ్ధిదారుల బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి పొన్నూరు శాసన సభ్యులు కిలారి వెంకట రోశయ్య అధ్యక్షత వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 30 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఇంత పెద్దత్తున ఇళ్ళ నిర్మాణ కార్యక్రమం చేపట్టడం ద్వారా పేదల సొంత ఇంటి కలలను సాకారం చేయబోతున్నామని కలెక్టర్ అన్నారు. ఇళ్ళ నిర్మాణంలో ఎక్కడా రాజీ పడకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వమే పేదలందరికీ తక్కువ ధరలకు నిర్మాణ సామగ్రిని అందజేస్తుందని ప్రకటించారు. ఒకేసారి లబ్ధిదారులంతా పెద్ద ఎత్తున ఇళ్ళ నిర్మాణం చేపట్టడం ద్వారా పేదలకు నిర్మాణ సామాగ్రి తక్కువ ధరలకు లభించడం, ప్రయాణ ఖర్చులు, కూలీల సమస్య పరిష్కారం అవుతుందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మంచి మనసుతో ఆలోచించి ఈ తరహా ఇంటి నిర్మాణాలకు శ్రీకారం చుట్టారని కొనియాడారు. 

స్థానిక శాసన సభ్యుల చొరవతో గ్రామీణ ప్రాంతాలు,పట్టణ ప్రాంతాలకు దగ్గరలో మరిన్ని కొత్త కాలనీలు  రూపుదిద్దుకోవడం జరుగుతుందని అన్నారు. అధికారులు దగ్గరుండి మరీ పేదల ఇళ్ళ నిర్మాణాలు పూర్తి అయ్యేలా సహయ,సహకారాలు అందిస్తారని పేర్కొన్నారు. ఇళ్ళ నిర్మాణాల పనుల విషయంలో రాజీ లేకుండా లబ్ధిదారులకు ఇష్టమైన రీతిలో పూర్తిచేసి ఇవ్వాలన్నారు. ఒక్క పొన్నూరు పట్టణంలోనే టిడ్కో బహుళ అంతస్తుల సముదాయాల పక్కన సుమారు 4,544 మంది లబ్ధిదారుల కోసం అన్ని వసతులతో కూడిన లేఅవుట్ ను ఏర్పాటుచేశామన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన రెడ్డి ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా మొత్తం మీద వారం రోజుల్లో 10 వేల ఇళ్ళ నిర్మాణాల పనులను చేపడతామన్నారు. పేదల ఇళ్ళ నిర్మాణ కార్యక్రమానికి సహకరిస్తున్న అధికారులు, శాసన సభ్యులు, ప్రజా ప్రతినిధులను అభినందిస్తున్నానని అన్నారు. ఈ ఇళ్ళ నిర్మాణ ప్రక్రియను చేపటట్టడం ద్వారా రాష్ట్ర ఆర్ధిక పురోగతిలో బలమైన మార్పులు వస్తాయన్న నమ్మకాన్ని ముఖ్యమంత్రి అందరిలో కల్పించారని సంతోషం వ్యక్తం చేశారు. టిడ్కో రహదారి పనులకు సంబంధించిన బిల్లు పెండింగ్ లో ఉందని, త్వరలో వాటిని విడుదల చేస్తామని అన్నారు.

పొన్నూరు శాసన సభ్యులు కిలారి వెంకట రోశయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో పేదలు ఇళ్ళ స్థలాల కోసం ఎదురు చూడకుండానే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పేదల బతులకుల్లో వెలుగులు నింపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని కొనియాడారు. ఇటువంటి ముఖ్యమంత్రి నాయకత్వంలో పని చేయడం గొప్పవరంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో పేదలకు ఈ తరహా సేవలు అందించే ముఖ్యమంత్రిని చూడబోమని అన్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి వంటి గొప్పనాయకుడి తనయుడిగా రాష్ట్ర ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నిలిచిపోతారన్నారు. రానున్న తరాలకు సరిపోయే విధంగా నవరత్నాలు- నిరుపేదలకు ఇళ్ళు కార్యక్రమం రూపొందించారని అన్నారు. నూతన ఇళ్ళ నిర్మాణాల కాలనీల్లో మౌలిక వసతులను సైతం వెంటనే కల్పించడం దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం  చేపట్టలేదని అన్నారు. కోవిడ్ సమయంలో పనులు లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఇళ్ళ నిర్మాణాల ద్వారా ఉపాధి పనులు చూపించారని పేర్కొన్నారు.

 ప్రజల చేతుల్లో నిరంతరం డబ్బులు ఉండేలా సంక్షేమ పధకాలను రూపొందించడం ద్వారా ఆర్ధిక పరిస్థితిని మెరుగుపరిచే విధంగా ముఖ్యమంత్రి పని చేస్తున్నారని ప్రశంసించారు. నవరత్నాల పథకాల పేరుతో చేపట్టే ప్రతీ కార్యక్రమాన్ని ప్రజలకు ఉపయోగపడేలా కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కి ప్రతీ ఒక్కరూ సహకరించాలని కోరారు. ముఖ్యమంత్రి చేపట్టిన పధకాలు అన్నింటిలోనూ నవరత్నాలు- పేదలందరికీ ఇళ్ళ నిర్మాణాల పధకం తనకు స్వహతగా ఎంతో సంతృప్తిని ఇచ్చిందని ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య పేర్కొన్నారు.  ఇళ్ళ నిర్మాణాలు త్వరిత గతిన పూర్తి చేయాలంటే గృహనిర్మాణ శాఖ అధికారులకు టిడ్కో గృహనిర్మాణాల చెంత గదిని కేటాయించాలని జిల్లా కలెక్టర్ ను కోరారు. అందుకు కలెక్టర్ సుముఖత వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ప్రజల జీవన విధానం మారబోతుందనడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పధకాలే నిదర్శనమని వెల్లడించారు.

సంయుక్త కలెక్టర్ ( సచివాలయాలు,అభివృద్ధి ) పి.ప్రశాంతి మాట్లాడుతూ వారం రోజుల్లో జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో నవరత్నాలు- నిరుపేదలకు ఇళ్ళ నిర్మాణాల కార్యక్రమాలను పెద్దఎత్తున చేపడుతున్నామని అన్నారు. సుమారు 10వేల ఇంటి నిర్మాణాలు ప్రారంభమయ్యేలా అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి పని చేస్తున్నామని అన్నారు. లబ్ధిదారులకు అవసరమైన నిర్మాణ సామగ్రిని అందుబాటులో ఉంచామన్నారు. ఒకే సారి ఇళ్ళ నిర్మాణ పనులు చేపట్టడం వలన లబ్ధిదారులకు పెద్దఎత్తున ఖర్చు తగ్గుతుందని అన్నారు. నిర్మాణాలు పలు దశల్లో ఉండగానే ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించే విషయంలో అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని వెల్లడించారు. ప్రజలంతా సంతోషంగా సొంత ఇళ్ళను నిర్మించుకోవాలని పిలుపు నిచ్చారు. 

తెనాలి సబ్ కలెక్టర్ మయూర్ అశోక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ధేశించిన నవరత్నాలు- నిరుపేదలకు ఇళ్ళు నిర్మాణాల కార్యక్రమం పూర్తి చేసేందుకు తమవంతు కృషి చేస్తున్నామని అన్నారు. డివిజన్ లో అధిక సంఖ్యలో పేదలకు ప్రభుత్వం లక్షల విలువ చేసే ఇళ్ళ స్థలాలను ఉచితంగా అందివ్వడం గొప్ప విషయమన్నారు. తొలిదశలో తెనాలి డివిజన్ లో విడుదల చేసిన 3వేల ఇళ్ళను త్వరితగతిన పూర్తి చేయిస్తామన్నారు. పొన్నూరు వంటి ప్రాంతాల్లో టిడ్కో ఇళ్ళతో పాటుగా పేదలకు ఆదునిక తరహాలో ఇళ్ళనిర్మాణాలు పూర్తిచేసి  మౌలిక వసతులు కల్పిస్తామని పేర్కొన్నారు.

గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ వేణుగోపాలరావు మాట్లాడుతూ నవరత్నాలు- నిరుపేదలకు ఇళ్ళు పేరుతో రాష్ట్ర ప్రభుత్వం బృహత్తర కార్యక్రమం చేపట్టిందని అన్నారు. జిల్లాలోని ఇల్లులేని పేదప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని సొంత ఇంటి కలలను సాకారం చేసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఇళ్ళ నిర్మాణ కార్యక్రమాన్ని వందశాతం పూర్తి చేసేందుకు తమశక్తి వంచన లేకుండా పనిచేసి మంచిపేరు తెచ్చుకుంటామని పేర్కొన్నారు.

శిక్షణా కలెక్టర్ శుభం బన్సాల్ మాట్లాడుతూ పేద ప్రజలకోసం గృహ నిర్మాణ పధకం అందుబాటులోకి రావడం ప్రశంసనీయమన్నారు. ఇందుకోసం కృషి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పధకాల సేవలను కొనియాడారు. ప్రభుత్వ పధకాలు సమర్ధంతంగా పేదలకు వచ్చేలా చూడటంలో తనవంతు పాత్రను పోషిస్తామని వెల్లడించారు. అనంతరం సుజాత అనే మహిళా  లబ్ధిదారురాలి గృహ నిర్మాణానికి కలెక్టర్ వివేక్ యాదవ్, పొన్నూరు శాసన సభ్యులు కిలారి వెంకట రోశయ్య, సంయుక్త కలెక్టర్ ప్రశాంతి, తెనాలి సబ్ కలెక్టర్ మయూర్ అశోక్, ట్రైనీ కలెక్టర్ శుభం బన్సాల్ లు కొబ్బరి కాయలు కొట్టి, నవ ధాన్యాలు చల్లి, శంఖుస్థాపన చేశారు. అనంతరం మీడియాతో నవరత్నాలు- నిరుపేదలకు ఇల్లు నిర్మాణ కార్యక్రమాలు అమలు చేస్తున్న తీరును వివరించారు. ఈ కార్యక్రమంలో పొన్నూరు మున్సిపల్ మాజీ ఛైర్ పర్సన్ రూత్ రాణి, తహాశీల్ధార్ పద్మనాభుడు, ఎం.పి.డి.వొ అత్తోట దీప్తి, గృహనిర్మాణ, విద్యుత్తు, రెవెన్యూ, ఎపి ఫైబర్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.