కోవిడ్ చికిత్సకోసం డా. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కింద చేరినప్పటికీ, నిబంధనలను ఉల్లంఘిస్తూ రోగి నుంచి వసూలు చేసిన రూ.4,50,000 సొమ్మును కాకినాడలోని ఇనోదయ ఆసుపత్రి తిరిగి బాధితునికి చెల్లించింది. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి, జేసీ (డీ) కీర్తి చేకూరి సమక్షంలో బాధితునికి రిఫండ్ చెక్కును అందించింది. ఆరోగ్యశ్రీ కింద కోవిడ్ చికిత్స అందించేందుకు ఆసుపత్రిలో చేర్చుకున్నప్పటికీ తమ నుంచి రూ.4,50,000 మొత్తాన్ని వసూలు చేశారంటూ రోగి మార్ని సత్తిరాజు కుమారుడు కాశీవిశ్వనాథం, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర శేఖరరెడ్డితో కలిసి కలెక్టర్‌కు ఇటీవల ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై జేసీ (డీ) నేతృత్వంలోని ఆరోగ్యశ్రీ జిల్లా క్రమశిక్షణ కమిటీ విచారించింది. కమిటీ నివేదిక మేరకు ఇనోదయ ఆసుపత్రికి రూ.22,50,000 పెనాల్టీ విధించారు. రోగి నుంచి వసూలు చేసిన మొత్తాన్నితిరిగి ఆయనకు చెల్లించాలని ఆదేశించారు. ఈ మేరకు తాజాగా బాధితునికి రిఫండ్ చెక్కు అందించారు. ఆసుపత్రిలో పనిచేస్తున్న ఆరోగ్యమిత్రను విధుల నుంచి టెర్మినేట్ చేశామని, ఆసుపత్రి నుంచి పెనాల్టీ మొత్తాన్ని వసూలు చేసినట్లు జేసీ (డీ) తెలిపారు. జిల్లాలో ఆరోగ్యశ్రీ కింద చేరిన రోగుల నుంచి డబ్బులు వసూలు చేసినా, వైద్య సేవలు అందించడంలో వివక్ష చూపినా కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో డా.వైఎస్సార్ ఆరోగ్యశ్రీ జిల్లా సమన్వయకర్త డా. పి.రాధాకృష్ణ పాల్గొన్నారు.