విజయనగరం జిల్లాలో ప్రతి రోజూ 5వేల కరోనా నిర్ధారణ పరీక్షలు ఖచ్చితంగా జరగాలని జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ వైద్యాధికారులను ఆదేశించారు. ఆయా పి.హెచ్.సి.లకు నిర్దేశించిన లక్ష్యం మేరకు తప్పనిసరిగా టెస్టులు నిర్వహించాలన్నారు. వైద్యాధికారులతో కలెక్టర్ శుక్రవారం టెలి కాన్ఫరెన్సు నిర్వహించారు. వైద్యాధికారులు తమ వద్ద ఉన్న వ్యాక్సిన్ నిల్వలను పూర్తిస్థాయిలో వినియోగించి చివరి డోసు వరకూ పూర్తిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో 21 వేల డోసుల వ్యాక్సిన్ మిగిలి వుందని ఈ వ్యాక్సిన్ నిల్వలను శుక్రవారం సాయంత్రంకల్లా పూర్తిచేయాలన్నారు. వ్యాక్సినేషన్ పై జాయింట్ కలెక్టర్(అభివృద్ధి) డా.ఆర్.మహేష్ కుమార్, ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి ఆర్.కూర్మనాథ్, సబ్ కలెక్టర్ విధేఖరే, డి.ఎం.హెచ్.ఓ. డా.రమణకుమారి, జిల్లాపరిషత్ సి.ఇ.ఓ. వెంకటేశ్వరరావులకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించామన్నారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 72 కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాల ద్వారా సాయంత్రానికి పదివేల మందికి వ్యాక్సినేషన్ పూర్తిచేశారు.