స్వచ్ఛంద సంస్థలకు సహకారం అవసరం..


Ens Balu
1
Guntur
2021-06-04 15:22:07

కోవిడ్ పై పోరులో స్వచ్ఛంద సేవా సంస్థల భాగస్వామ్యం అత్యంత విలువైనదని  జిల్లా సంయుక్త కలెక్టర్ (రైతు భరోసా, రెవెన్యూ) కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. శుక్రవారం  కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో సంయుక్త కలెక్టర్ (రైతు భరోసా, రెవెన్యూ)  దినేష్ కుమార్ అధ్యక్షతన జిల్లా స్థాయి స్వచ్ఛంద సేవా సంస్థల సమన్వయ కమిటి సమావేశం జరిగింది. సందర్భంగా సంయుక్త కలెక్టర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ కోవిడ్ నివారణ కొరకు స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వ యంత్రాంగం కలిసి ప్రణాళికా బద్ధంగా పని చేసినట్లైతే మంచి ఫలితాలు వస్తాయని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు జిల్లాస్థాయి ప్రభుత్వ సంస్థలు మరియు ఎన్.జి.ఓ కో- ఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు. కోవిడ్ ను ఎదుర్కొనడానికి చేపడుతున్న చర్యలలో భాగంగా అవసరమైన ప్రాజెక్ట్ నివేదికలను తయారుచేయడానికి, పరికరాలను సమకూర్చుకోవడానికి, మానవ  వనరుల సైన్యాన్ని తయారు చేసుకోవడానికి, వివిధ స్థాయిలలో నిధులను సమకూర్చుకోవడానికి స్వచ్ఛంద సేవా సంస్థల నుండి నిష్ణాతులైన వ్యక్తులు ముందుకు రావాలని ఆయన కోరారు. జిల్లాలోని మారుమూల ప్రాంతాల కు కూడా వెళ్లి  ప్రజల అవసరాల మేరకు సేవలందిస్తున్న స్వచ్ఛంద సంస్థలకు జిల్లా ప్రభుత్వ యంత్రాంగం నుండి పూర్తి సహాయ సహకారాలు అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ భాగస్వామ్యాన్ని క్షేత్రస్థాయిలో పటిష్ట పరచడానికి డివిజన్ మరియు మండల స్థాయి, గ్రామ స్థాయిలో కమిటిల ఏర్పాటుకు అవసరమైన ఉత్తర్వులను అధికారులకు త్వరలో జారీ చేస్తున్నట్లు తెలియజేశారు. జిల్లా స్థాయి ప్రభుత్వ సంస్థలు మరియు ఎన్.జి.ఓ కో- ఆర్డినేషన్ కమిటీకి సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ మధుసూదన రావు, కన్వీనర్ గా పిల్లల రక్షణ అధికారి విజయ్ కుమార్ సభ్యులుగా నియమిస్తున్నట్లు తెలియజేశారు. ఇంకా ఈ సమావేశంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ అధికారిని మనోరంజని వివిధ స్వచ్ఛంద సంస్థ లైన  రెడ్ క్రాస్, డి బి ఆర్ సి, సీడ్స్, వి ఆర్ ఓ, అసిస్ట్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.