లోకంలోని మానవులలో ఎవరైతే హనుమంతుడిని సేవిస్తారో వారికి అష్టసిద్ధులు సిద్ధిస్తాయని ప్రముఖ పండితులు, జాతీయ సంస్కృత విశ్వ విద్యాలయం ఆచార్యులు రాణి సదాశివమూర్తి ఉద్ఘాటించారు. తిరుమలలో హనుమజ్జయంతి ఉత్సవాల్లో మొదటి రోజైన శుక్రవారం నాదనీరాజనం వేదికపై హనుమంతుడు - అష్టసిద్ధులు అనే అంశంపై ప్రవచన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఉపన్యసిస్తూ యోగశాస్త్రంలో ప్రసిద్ధి చెందిన ఎనిమిది సిద్ధులు ఉన్నాయని, అందులో అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశీత్యం ఉన్నాయన్నారు. వెంకటాద్రి క్షేత్రంలోని అంజనాద్రి కొండపై జన్మించిన ఆంజనేయస్వామిలో జన్మతః ఈ అష్టసిద్ధులు ఉన్నాయని, అందువలనే సూర్యుని పండుగా భావించి సూర్య మండలానికి వెళ్లాడని తెలిపారు. సుందరకాండలో హనుమంతుని ప్రవేశం నుండి యుద్ధ కాండ చివరి వరకు అష్టసిద్ధుల వలన ఆయన లోకానికి అద్భుతాలను చూపించి రామాయణాన్ని ఒక సుందర ఇతి హసంగా మలచడానికి కారణం అయ్యారన్నారు. సకల దేవతా స్వరూపముగా, రుద్రావతార మూర్తిగా, వాయుదేవుని అంశతో ఉద్భవించిన ఆంజనేయస్వామి లోకాలను అలంరించిన తీరు అద్భుతమన్నారు. యోగ శాస్త్రంలో వాయు బంధనం చేసి యమ నియమ ఆశనాదుల ద్వారా సాధన చేసిన సాధకుడు అష్టసిద్ధులను పొందగలరని చెప్పారు. అన్ని వ్యవహరాల్లో సాఫల్యం సాధించడానికి ఆంజనేయస్వామిని ఉపాసన చేయడం వలన అష్టసిద్ధులు పొందవచ్చని వివరించారు. మొదటి ఘాట్‌రోడ్డులోని ఏడవమైలు వద్ద ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామివారి విగ్రహానికి మధ్యాహ్నం 3 నుండి 3.30 గంటల వరకు టిటిడి పూజా కార్యక్రమాలను నిర్వహించింది.