తిరుమలలోని జాపాలి తీర్థంలో గల శ్రీ ఆంజనేయస్వామివారికి హనుమజ్జయంతి సందర్భంగా టిటిడి అదనపు ఈవో ఏ.వి.ధర్మారెడ్డి దంపతులు శుక్రవారం ఉదయం పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఈవో మీడియాతో మాట్లాడుతూ ఆకాశ గంగ తీర్థంలో అంజనాదేవి తపస్సు చేసి వాయుదేవుని ఆశీర్వదంతో ఆంజనేయస్వామివారికి జన్మనిచ్చిందన్నారు. త్రేతయుగంలో అంజనాద్రి కొండపై జాపాలి మహర్షి తపస్సు చేసి ఆంజనేయస్వామివారిని ప్రసన్నం చేసుకున్నారని తెలిపారు. కావున ఈ క్షేత్రానికి జాపాలి క్షేత్రం అని పేరు వచ్చిందని, ఇక్కడ ఉన్న స్వామివారు స్వయంభూ అని వివరించారు. దుష్ట శక్తులను సంహరించే ఆంజనేయస్వామివారు కరోనా మహమ్మరిని నిర్ములించి లోకంలోని ప్రజలకు ఆయురారోగ్యాలను ప్రసాదిస్తారన్నారు. అంతకుముందు ఆలయం వద్దకు చేరుకున్న టిటిడి అదనపు ఈవో దంపతులకు, సివిఎస్వో గోపినాధ్ జెట్టి దంపతులకు హథీరాంజీ మఠం మహంతు అర్జున్‌దాస్ స్వాగతం పలికారు. కారోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యలలో భాగంగా శ్రీ ఆంజనేయస్వామివారికి అభిషేకం, పూజ కార్యక్రమాలను ఏకాంతంతగా నిర్వహించారు. ఈ సందర్బంగా జాపాలి క్షేత్రంలో టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి పి.ఆర్.ఆనంద తీర్థాచార్యులు ఆధ్వర్యంలో కళాకారులు ఉదయం 10 నుంచి 11 గంటల వరకు హనుమాన్ చాలీసా పఠించారు. అనంతరం అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు ఆచార్య దక్షిణామూర్తి శర్మ ఆధ్వర్యంలో అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీ వెంకటేశ్వర్లు భాగవతార్ ఆంజనేయస్వామివారి అవిర్భంపై హరికథ పారాయణం చేశారు. ఈ కార్యక్రమాల్లో శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో హరీంద్రనాధ్, ఒఎస్‌డి పాల శేషాద్రి, ఆరోగ్యశాఖాధికారి డా.ఆర్.ఆర్.రెడ్డి, ఎస్టేట్ విభాగం డెప్యూటీ ఈవో విజయ సారధి, విజివో బాలిరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.