తిరుమలలో ఘనంగా హనుమజ్జయంతి..
Ens Balu
3
Tirumala
2021-06-04 15:29:32
తిరుమల క్షేత్రంలోని అంజనాద్రి కొండపై ఆంజనేయస్వామివారు జన్మించిన ఆకాశ గంగ తీర్థం వద్ద హనుమజ్జయంతి వేడుకలను శుక్రవారం తొలిసారిగా టిటిడి ప్రారంభించినట్లు టిటిడి ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్ రెడ్డి తెలిపారు. ఐదు రోజుల పాటు ఈ ఉత్సవాలను అకాశగంగ, జాపాలి వద్ద నిర్వహిస్తామని చెప్పారు. ఇందులో భాగంగా ఆకాశగంగ వద్ద అంజనాదేవి, బాల ఆంజనేయస్వామివారికి నిర్మించిన ఆలయంలో అభిషేకం, తమలపాకులతో పూజ, మల్లె పూలతో అర్చన నిర్వహించామన్నారు. అదేవిధంగా శ్రీవారి ఆలయానికి ఎదురుగానున్న శ్రీ బేడి ఆంజనేయస్వామివారికి, మొదటి ఘాట్‌రోడ్డులోని ఏడవమైలు వద్ద ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి విగ్రహానికి అభిషేక, అర్చన, నివేదనలు నిర్వహించినట్లు తెలిపారు. కోవిడ్ - 19 వ్యాప్తి నేపధ్యంలో ఇక్కడకు రాలేని భక్తులు ఎస్వీబిసి ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించి స్వామివారి అనుగ్రహనికి పాత్రులు కావాలని కోరారు. ఈ ఉత్సవాలకు ఏర్పాట్లు చేసిన టిటిడి సిబ్బందిని ఆయన అభినందించారు. అనంతరం రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం ఉపకులపతి ఆచార్య మురళిధర్ శర్మ మాట్లాడుతూ వైశాఖ శుద్ధ దశమినాడు హనుమజ్జయంతి ఉత్సవాలు నిర్వహిస్తారన్నారు. స్కంధ పురాణంలో తెలిపిన విధంగా మాతంగా మహర్షి సూచన మేరకు అకాశగంగ తీర్థం వద్ద అంజనాదేవి వేలాది సంవత్సరాలు తపస్సు చేసి ఆంజనేయస్వామివారికి జన్మనిచ్చినట్లు చెప్పారు. ఇప్పుడు ఆలయం నిర్మించిన ప్రదేశంలోనే అంజనాదేవి తపస్సు చేసినట్లు తెలిపారు. భారతీయ సనాతన ధర్మం, సంస్కృతికి మూలమైన పురాణాలను అనుసరించి ఆంజనేయస్వామివారు ఇక్కడ జన్మించారని వివరించారు. తరువాత అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారిణి జయంతి సావిత్రి బృందం హనుమంతుని వైభవంపై హరికథ పారాయణం చేశారు. ఈ పూజ కార్యక్రమంలో టిటిడి అదనపు ఈవో ఏ.వి.ధర్మారెడ్డి దంపతులు. సివిఎస్వో గోపినాధ్ జెట్టి దంపతులు, ఎస్వీబిసి సిఇవో సురేష్ కుమార్, విజివో బాలిరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. శ్రీవారి ఆలయానికి ఎదురుగానున్న శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయంలో ఉదయం 9.00 గంటలకు ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించారు.