రుణాలు సత్వరమే వచ్చేలా చూడండి..


Ens Balu
2
ఒంగోలు
2021-06-04 15:37:23

జగనన్న తోడు పథకంలో అర్హులందరికీ బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్  ప్రవీణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 8వ తేదీన లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో రుణాలు జమ చేసే కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి  వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి ప్రారంభించనున్న నేపధ్యంలో జిల్లాలోని పరిస్థితిపై సంబంధిత అధికారులతో కలెక్టర్ శుక్రవారం తన ఛాంబర్లో సమీక్షించారు.
చిరు వ్యాపారులు, చేతి వృత్తుల వారికి వడ్డీ లేని రుణాలు ఇప్పించి వారిని ఆదుకోవాలన్న గొప్ప సంకల్పంతో ముఖ్యమంత్రి ఈ పథకాన్నిఆన్ లైన్ చేస్తున్నందున అర్హులంద రూ లబ్దిపొందేలా చూడాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఇప్పటివరకు ఈ పథకం ద్వారా 32,248 మంది దరఖాస్తు చేసుకున్నారని అధికారులు ఈ సందర్భంగా కలెక్టరుకు తెలిపారు. వీరిలో పట్టణ ప్రాంతాల్లోని 10 వేల మందికి పి.ఎమ్. స్వనిధి నిధులను పి.డి.సి.సి. బ్యాంకు ద్వారా అందించాల్సి ఉందన్నారు. మిగ తావారికి డి.ఆర్.డి.ఏ. ద్వారా స్త్రీనిధి నిధులతో ఈ ఆర్థిక సహాయం అందించాల్సి ఉందని వారు వివరించారు. అయితే బ్యాంకుల వద్ద కొన్ని దరఖాస్తులు పరిశీలన పెండింగ్ లో ఉందని అధికారులు ఈ సందర్భంగా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, వీటిని వెంటనే పరిష్కరించి అర్హులందరికీ రుణాలు మంజూరు చేసేలా చూడాలని బ్యాంకు అధికారులను ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టి.ఎస్. చేతన్ (సచివాలయాలు, అభివృద్థి), డి.ఆర్.డి.ఏ. పి.డి. బాబూరావు, మెప్మా పి.డి. పి.వి. నారాయణ, ఎల్.డి.ఎమ్. యుగంధర్, పి.డి.సి.సి. బ్యాంకు సి.యి.ఓ. శివకోటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.