ఎన్ఎంఆర్ ఉద్యోగుల వేతనాలు పెంపు..


Ens Balu
2
Kakinada
2021-06-04 16:00:24

నామిన‌ల్ మ‌స్ట‌ర్ రోల్ (ఎన్ఎంఆర్‌) 2021-22 సంవత్సరానికి ఉద్యోగులు, కార్మికులకు రోజువారీ క‌నీస వేత‌నాలను నైపుణ్యం గ‌ల‌వారికి రూ.650,  పాక్షిక నైపుణ్యాలున్న వారికి రూ.460, నైపుణ్యం లేని వారికి రూ.370 లుగా పెంచుతూ నిర్ణ‌యించిన‌ట్లు క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి తెలిపారు. శుక్ర‌వారం క‌లెక్ట‌ర్  అధ్య‌క్ష‌త‌న ఎన్ఎంఆర్ పద్దతిలో పనిచేసే ఉద్యోగులు, కార్మికులకు వేత‌న నిర్ణయం పై ప్ర‌త్యేక క‌మిటీ స‌మావేశం వ‌ర్చువ‌ల్‌గా జ‌రిగింది. వినియోగ‌దారు ధ‌ర‌ల సూచీ (సీపీఐ) ఆధారంగా మదింపు చేసి జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీస‌ర్, కార్మిక‌శాఖ డిప్యూటీ క‌మిష‌న‌ర్‌లు వేత‌నాల‌పై రూపొందించిన ప్ర‌తిపాద‌న‌ల‌పై క‌మిటీ చ‌ర్చించింది. అదే విధంగా 2020-21లో నిర్దేశించిన నైపుణ్యం ఉన్న‌వారికి రూ.643, మ‌ధ్య‌త‌ర‌హా నైపుణ్యం ఉన్న‌వారికి రూ.460, నైపుణ్యం లేనివారికి రూ.367 వేత‌నాలకు, ప్ర‌స్తుత ప్ర‌తిపాద‌న‌ల మ‌ధ్య వ్య‌త్యాసాల‌ను జాయింట్ క‌లెక్ట‌ర్ (ఆస‌రా, సంక్షేమం) జి.రాజ‌కుమారి స‌మావేశంలో వివ‌రించారు. అన్ని అంశాల‌నూ సహేతుకంగా ప‌రిశీలించిన మీద‌ట క‌లెక్ట‌ర్ ముర‌ళీధ‌ర్‌రెడ్డి.. 2021-22కు కొత్త క‌నీస వేత‌నాల‌ను సవరిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. జిల్లాలో న‌వ‌ర‌త్నాలు-పేద‌లంద‌రికీ ఇళ్లు ప‌థ‌కం కింద భారీఎత్తున జ‌ర‌గ‌నున్న ఇళ్ల నిర్మాణాలు, ఇత‌ర కార్య‌క్ర‌మాల‌ను దృష్టిలో ఉంచుకొని వేత‌నాల‌ను స్థిరీకరించామని క‌లెక్ట‌ర్ తెలిపారు. ఉపాధి క‌ల్పించే వారికి, ఉపాధి పొందే వారికి ఇద్ద‌రికీ ఇబ్బంది లేకుండా స‌మ‌తుల్యం పాటిస్తూ క‌మిటీ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వెల్ల‌డించారు. కొత్త వేత‌నాల‌ను ప‌టిష్టంగా అమ‌ల‌య్యేలా సంబంధిత శాఖ‌ల అధికారులు చూడాల‌ని, నిబంధ‌న‌లు ఉల్లంఘించిన వారిపై కేసులు న‌మోదు చేయాల‌ని క‌లెక్ట‌ర్ ఆదేశించారు. సమావేశంలో డీఆర్వో సీహెచ్ సత్తిబాబు, సీపీవో బాలాజీ, కార్మిక శాఖ అదనపు కమిషనర్ ఎన్. బుల్లిరాణి తదితరులు పాల్గొన్నారు.