పర్యావరణ పరిరక్షణలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామివారి దేవస్థానం అనువంశిక ధర్మకర్త సంచయిత గజపతి పిలుపునిచ్చారు. శనివారం అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని దేవస్థానం పరిధిలోని తోటల్లో ఆమె ఈఓతో కలిపి పండ్ల మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రతీ ఒక్కరూ తమ ఇంటి ఆవరణలోనే రెండు మొక్కలను నాటి వాటి సంరక్షణ బాధ్యతలు వారే చూసుకోవాలన్నారు. ముఖ్యంగా ఫలసాయాలు, పచ్చదనం ఇచ్చే మొక్కలు నాటడం ద్వారా అవి భావి తరాల వారికి ఎంతో బాగ ఉపయోగపడతాయన్నారు. అంతేకాకుండా వాతావరణ కాలుష్యం కాకుండా అడ్డుకోవడానికి మంచి ఆయుధంగా కూడా పనిచేస్తాయన్నారు. భూమితల్లి ఒడిలో తమ బిడ్డల్లా మొక్కలను పెంచి మన చుట్టూ వున్న వాతావరణాన్ని పచ్చగా చేసుకోవడం ద్వారా మనం పీల్చే గాలికూడా స్వచ్ఛంగా మారుతుందన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన సిబ్బంది కూడా పాల్గొని మొక్కలు నాటారు.