భవిష్యత్తులో యువతకు సుస్థిర ఉపాధి, నాణ్యమైన జీవితం లభించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత నైపుణ్యాలు, విలువలతో కూడిన విద్యను అందించేందుకు కృషిచేస్తోందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డా. ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి పినిపే విశ్వరూప్, వ్యవసాయ శాఖా మంత్రి కురసాల కన్నబాబు, బీసీ సంక్షేమ శాఖా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ, జేఎన్‌టీయూకే ఇన్‌ఛార్జ్ ఉపకులపతి సతీష్‌చంద్ర, ఎంపీ వంగా గీత, ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు, కాకినాడ అర్బన్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి తదితరులతో కలిసి విద్యాశాఖ మంత్రి డా. ఆదిమూలపు సురేష్ శనివారం కాకినాడ జేఎన్‌టీయూలో ఏర్పాటుచేసిన భారతరత్న బాబాసాహెబ్ డా. బీఆర్ అంబేడ్కర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం యూనివర్సిటీ క్యాంపస్‌లో రూసా నిధులతో నిర్మించనున్న పీజీ బాలుర వసతి గృహానికి శంకుస్థాపన చేశారు. నేషనల్ సర్వీస్ స్కీమ్ (ఎన్ఎస్ఎస్) ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సహచర మంత్రులతో కలిసి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాతో మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబా సాహెబ్ డా. బీఆర్ అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగంలో విప్లవాత్మక సంస్కరణలు అమలుచేస్తోందని తెలిపారు.
ఈ మార్పులు, సంస్కరణలు దేశానికే ఆదర్శవంతంగా నిలుస్తున్నాయని, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మాధ్యమంలో బోధన, సీబీఎస్ఈ పాఠ్యప్రణాళిక అమలుకు గౌరవ ముఖ్యమంత్రి కృషిచేస్తున్నారన్నారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్)లో తొలి పది స్థానాల్లో ఎస్‌వీయూ, ఏయూ, జేఎన్‌టీయూ తదితర విశ్వవిద్యాలయాలను నిలిపే లక్ష్యంతో మౌలిక వసతుల కల్పన, విద్యలో ప్రమాణాలు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అత్యున్నత నైపుణ్యాలతో ఉన్నత విద్యను అందించే లక్ష్యంతో విద్యా రంగంలో సమూల మార్పులకు ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు. విద్యారంగంలో జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన వంటి సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలవుతున్నాయని, మనబడి-నాడునేడు ద్వారా పాఠశాలల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయన్నారు. నాడునేడు తొలిదశలో రూ.3,600 కోట్లు, రెండో దశలో దాదాపు రూ.నాలుగు వేల కోట్లతో పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. జూనియర్, డిగ్రీ కళాశాలలను కూడా మౌలిక వసతులు, విద్యా ప్రమాణాల పరంగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. విద్యార్థి జీవితంలో పరీక్షలు చాలా ముఖ్య అంశమని, తల్లిదండ్రుల ఆందోళన, ఉపాధ్యాయుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పరీక్షలను వాయిదావేశామని, కోవిడ్ ఉద్ధృతి తగ్గిన తర్వాత అన్ని జాగ్రత్తలతో పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని, జులై నాటికి పరిస్థితి కుదుటపడే పరిస్థితి కనిపిస్తోందని వెల్లడించారు. పరీక్షల నిర్వహణ వల్ల ఉన్నత విద్యాకోర్సుల్లో ప్రవేశాలు, పోటీపరీక్షలు తదితరాల పరంగా విద్యార్థులకు ఇబ్బందులు తప్పుతాయన్నారు. కోవిడ్ మేనేజ్‌మెంట్ విషయంలో రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలు ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయని మంత్రి ఆదిమూల పు సురేష్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో జేఎన్‌టీయూ-కాకినాడ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సీహెచ్ సత్యనారాయణ; జిల్లా ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు నక్కా చిట్టిబాబు, వర్సిటీ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.