పర్యావరణాన్ని మొక్కతోనే కాపాడాలి..
Ens Balu
3
Visakhapatnam
2021-06-05 12:25:39
పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటాలని మహావిశాఖ నగరపాలక సంస్థ మేయర్ గొలగాని హరివెంకట కుమారి పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జీవిఎంసీ ప్రాంగణంలో మేయర్ శనివారం డిప్యుటీ మేయర్ జియ్యాని శ్రీధర్ తో కలసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఐక్యరాజ్యసమితి 1972 జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా ప్రకటించిందని, అప్పటినుండి పర్యావరణ పరిరక్షణకు యావత్ ప్రపంచం కృషి చేస్తుందని అందులో భాగంగా మన విశాఖపట్నంలో మొక్కలు నాటే కార్యక్రమం నా చేతుల మీదుగా నాటడం నా అదృష్టంగా భావిస్తున్నానని మేయర్ తెలిపారు. జీవ వైవిధ్యాన్ని, పర్యావరణ సమతుల్యాన్ని కాపాడటం లో అడవులు పాత్ర ఎంతో కీలకమైనదని, రోజురోజుకు భూమిపై పచ్చదనం నశించిపోతుందని, మానవుడు చెట్లను నరికి పర్యావరణానికి తూట్లు పొడుస్తున్నారని, అడవులను నరికి నందు వలన అకాల వర్షాలు, అధిక ఎండలు, కరువు ఏర్పడి మానవజాతి మనుగడకు ప్రమాదం ఏర్పడుతుందని, ఒక చెట్టు తొలగించే ముందు దాని స్థానంలో ఐదు మొక్కలు నాటాలని, నేడు ప్లాస్టిక్ భూతం పర్యావరణానికి అడ్డంకిగా మారిందని, కాలువలోను, గెడ్డలలోను చెత్త మరియు ప్లాస్టిక్ వస్తువులు వేయడం వలన చాలా వరకు నష్టం చేకూరుతుందని, పర్యావరణ పరిరక్షణకు ప్రతి పౌరుడు కృషి చేయాలని అప్పుడే మనిషి దగ్గరకు ఎటువంటి రోగాలు దరిచేరవని మేయర్ తెలిపారు. డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్ మాట్లాడుతూ, ఈ రోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జివిఎంసి మేయర్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం జరిగిందని, చెట్లు వలన మనకు ప్రాణవాయువు లభిస్తుందని అలాంటి చెట్లను నరికి వేయడం వలన మానవ మనుగడకే ప్రమాదం అని, కావున ప్రతి ఒక్కరు తమ ఇంటిముందు మొక్కలు నాటాలని సూచించారు. మన విశాఖ ఇప్పటికే పచ్చదనంతో మెరుస్తుందని, దీనిని మరింత పచ్చదనంతో తీర్చిదిద్దాలన్నారు. ఈ కార్యక్రమంలో జివిఎంసి అదనపు కమిషనర్ ఆషాజ్యోతి, ఎ.డి.(హార్టికల్చర్) ఎం. దామోదర రావు, ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, కార్యనిర్వాహక ఇంజనీర్ (పి.ఎల్.&సి) మెహర్ బాబా, డాక్టర్ మురళీ మోహన్, యు.ఎన్.డి.పి. శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.