అమ్మ ఛారిటబుల్ ట్రస్ట్ మరువలేని సేవలు ..


Ens Balu
3
Guntur
2021-06-05 13:46:18

అమ్మ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కోవిడ్ సోకి మరణించిన వారి  తరపు కుటుంబ సభ్యులకు, బంధువులకు ఉచితంగా వసతులు కల్పించడం ఎంతో అభినందనీ యమని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ  శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు  కొనియాడారు. శనివారం స్థానిక నల్లపాడు రోడ్ లో శ్రీ నాగసాయి మందిరం ఎదురు మిర్చి యార్డు దగ్గర అమ్మ ఛారిటబుల్ ట్రస్ట్ నూతన భవనాన్ని, ట్రస్ట్ ఆవరణలో  జాతీయ పతాకం రూపశిల్పి పింగళి వెంకయ్య విగ్రహాన్ని  రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖామాత్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు, గుంటూరు తూర్పు నియోజక వర్గ శాసన సభ్యులు మహమ్మద్ ముస్తఫా, పశ్చిమ శాసన సభ్యులు మద్దాలి గిరిధర్, సంయుక్త కలెక్టర్ ( రైతు భరోసా, రెవిన్యూ ) ఏ.ఎస్. దినేష్ కుమార్   లు కలసి ప్రారంభించారు. అనంతరం మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస రావు మాట్లాడుతూ కోవిడ్ సోకిన వ్యక్తులకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి అన్ని రకాలుగా ఆదుకోవడం జరుగుతుందన్నారు.  అమ్మ ఛారిటబుల్ ట్రస్ట్ వారు కోవిడ్ సోకి చనిపోతున్న వ్యక్తులకు దహన సంస్కారాలు చేయడం, వారి తరపున వుండే కుటుంబ సభ్యులను, బంధువులను ఓదార్చడం, ఆరోగ్య రీత్యా  మందులు అందించడం, భోజన వసతి కల్పించడం, అన్ని విధాలుగా సౌకర్యంగా చూడడం చాలా గొప్పగా ఉందన్నారు.  ఇలాంటి స్వచ్చంధ  సంస్థలకు దాతలు ఇతోధికంగా సహాయం అందిచాలని ఆయన కోరారు.  పింగళి వెంకయ్య ప్రజల్లో దేశ భక్తిని పెంపొందించేందుకు మూడు రంగుల జాతీయ జెండాను రూపొందించారని, ఆయన భావాలను గుర్తించి ప్రజలందరూ వారు సూచించిన  మార్గంలో నడవాలన్నారు. 

నగర మేయర్  కావటి శివనాగ మనోహర్  నాయుడు మాట్లాడుతూ, అమ్మ ఛారిటబుల్ ట్రస్ట్  నిర్వాహకులు స్వామి  ప్రసన్న గిరి 25 సంవత్సరాల నుండి కష్టాలలో ఉన్న ప్రజలను ఆదుకుని, ఎలాంటి సహకారం లేని వ్యక్తులకు సేవా దృక్పధంతో కార్యక్రమాలు చేయడం జరుగుతున్నదన్నారు.  ఇలాంటి కోవిడ్ విపత్కర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, కరోనా సోకి చనిపోయిన వ్యక్తులను ఎవరు పట్టించుకోని స్థితిలో ఆసుపత్రుల నుండి నేరుగా శ్మశాన వాటికలకు తీసుకుని  వెళితే  ఎలాంటి అలుపు సొలుపు లేకుండా దహన సంస్కారాలు చేయడం  జరుగుతున్నదని  కొనియాడారు. కోవిడ్ సోకిన వ్యక్తులకు మన సొంత కుటుంబ సభ్యులే పట్టించుకోని స్థితిలో ఇలాంటి ట్రస్టు ల ద్వారా ఎంతో మేలు  జరుగుతుందన్నారు.  కరోనా సోకిన వ్యక్తులకు ప్రభుత్వం చేసే  సాయంతో పాటు ఈ ట్రస్టుకు దాతలు విరాళాలు ఇస్తున్నారని,               కరోనా సోకి ఖర్చులు పెట్టుకోస్థితిలో ఉన్న వారికి వారికి ఇటువంటి ట్రస్టులు ఎంతో మేలు చేస్తాయనే విషయాన్ని గుర్తించాలన్నారు.  

  గుంటూరు తూర్పు నియోజక వర్గ శాసన సభ్యులు మహమ్మద్ ముస్తఫా  మాట్లాడుతూ  కోవిడ్ -19 సోకిన వ్యక్తులకు తమ వంతు సహాయంగా టీకాలు  వేయించేందుకు అన్ని విధాల తోడ్పాటునందించడం జరుగుతుందన్నారు.  ప్రజలు కూడా అప్రమత్తంగా వుండి ప్రభుత్వం చెప్పిన విధంగా మాస్కులు, శానిటైజర్  వాడుతూ, భౌతిక దూరం పాటించాలని సూచించారు. గుంటూరు  పశ్చిమ శాసన సభ్యులు మద్దాలి గిరిధర్ మాట్లాడుతూ కరోనా మొదటి వేవ్  కన్నా సెకండ్ వేవ్ చాలా ఉదృతంగా ఉన్నట్లుగా మనందరం చూడడం జరుగుతున్నదని, అన్నారు. కోవిడ్ వల్ల  ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ఉండేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్  రెడ్డి కోవిడ్ -19 వైద్య చికిత్స కోసం కేటాయించిన ప్రతి ఆసుపత్రిలో కరోనా రోగులకు 50 శాతం బెడ్లు కేటాయించాలని చెప్పడం జరిగిందన్నారు.  ప్రజలకు ఈ కోవిడ్ మహమ్మారి ఎంతో నష్టం చేకూర్చిందని, అయితే రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్–19 రోగులకు ఉచితంగా వైద్యాన్ని అందిస్తున్నదన్నారు.  ఇకనైనా తగ్గిపోతుందని ఆశిస్తున్నామన్నారు.  

  అమ్మ ఛారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు స్వామి  ప్రసన్న గిరి మాట్లాడుతూ కోవిడ్ బారినపడి చనిపోయిన   వ్యక్తి యొక్క బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు ఇళ్ళకు రాలేని బాధితులకు ఈ ట్రస్ట్ లో వసతి ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.  ఇలాంటి బాధితులు 200  మందికి వసతి కల్పించడంతో పాటు,  అన్ని కులాలకు, మతాలకు అతీతంగా ఎలాంటి తారతమ్యం లేకుండా  భోజన, వసతి  సౌకర్యాలు, మందులు అందించడం జరుగుతుందన్నారు. కోవిడ్ సోకి మరణించిన  వ్యక్తులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ ట్రస్ట్ కు అప్పగించిన బాధ్యతలను తప్పక నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రతిరోజు కోవిడ్ సోకి చనిపోయే వ్యక్తుల  దహన సంస్కారాలు చేయడం వలన మా ట్రస్ట్ సిబ్బంది కొన్ని సమయాల్లో నిద్రరావడం లేదని చెప్పడం జరుగుతుందన్నారు.  అయినప్పటికీ ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మా వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడు ప్రభుత్వానికి అందించడమే మా ధ్యేయమన్నారు.  ఈ కార్యక్రమంలో బొమ్మిడాల భానుమూర్తి ట్రస్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు.