రాష్ట్రంలో పేద ప్రజలందరికీ సొంత గృహాలను అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పని చేస్తున్నారని గృహనిర్మాణ శాఖ రాష్ట్ర డైరెక్టర్ డాక్టర్.ఎన్ భరత్ గుప్తా అన్నారు. శనివారం గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం,పసుమర్రు గ్రామంలో నవరత్నాలు-పేదలందరికీ ఇల్లు పధకంలో భాగంగా ఇళ్ళ నిర్మాణాలకు శంఖుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిధులుగా రాష్ట్ర గృహనిర్మాణశాఖ డైరెక్టర్ డాక్టర్.ఎన్.భరత్ గుప్తా, గుంటూరు జిల్లా కలెక్టర్ తోపాటు, చిలకలూరిపేట శాసన సభ్యురాలు విడుదల రజని లు హాజరయ్యారు. కార్యక్రమానికి చిలకలూరిపేట శాసన సభ్యురాలు విడుదల రజని అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన లబ్ధిదారుల పండుగ సభలో రాష్ట్ర గృహనిర్మాణశాఖ డైరెక్టర్ డాక్టర్.ఎన్.భరత్ గుప్తా మాట్లాడుతూ ఒకే సారి ఎక్కువ సంఖ్యలో ఇల్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు తక్కువ ధరలకు నిర్మాణ సామాగ్రిని రాష్ట్ర ప్రభుత్వమే అందిస్తుందని తెలిపారు. దీంతో పాటుగా ప్రతి లబ్ధిదారునికి ఉచితంగా 20 టన్నుల ఇసుకను అందించేలా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. గృహనిర్మాణ ప్రాంతాల దగ్గరే గృహనిర్మాణశాఖతో పాటుగా అందుకు అనుబంధంగా పని చేస్తున్న శాఖల అధికారులకు కార్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. లబ్ధిదారులు ఇళ్ళ నిర్మాణంలో ఎక్కడా ఇబ్బందులు పడకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. బేస్ మెంట్ ఏర్పాటు చేసుకున్న లబ్ధిదారులకు వెంటనే బిల్లులు చెల్లించేలా గ్రామ సచివాలయ అధికారులను నిరంతరం అందుబాటులో ఉంచుతున్నామని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని రాష్ట్ర మహిళలు సొంత ఇంటికలను సాకారం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
గుంటూరు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ మాట్లాడుతూ జూన్ 1వ తేది నుంచి 10 వ తేదిలోపు రాష్ట్ర ప్రభుత్వం నిర్ధేశించిన 10 వేల ఇళ్ళ నిర్మాణాల కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తామని వెల్లడించారు. గత పాదయాత్ర సమయంలో ఇచ్చిన మాటకు కట్టుబడి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అర్హత కలిగిన అక్కచెల్లెమ్మలందరికీ నవరత్నాలు- పేదలకు ఇళ్ళు పధకంలో భాగంగా ఇళ్ళ స్థలాలు కేటాయించారన్నారు. పేదలందరికీ అనువైన ఇళ్ళ నిర్మాణం చేపట్టే కార్యక్రమానికి ముందడుగు వేయడం అభినందనీయమన్నారు. ఎంతో గొప్ప మనసున్న ముఖ్యమంత్రిని తాను ఎన్నడూ చూడలేదని సంతోషం వ్యక్తం చేశారు. దేశంలో ఇటువంటి సంక్షేమ పధకాలు మరే ఇతర రాష్ట్రాల్లో కొనసాగుతున్న దాఖలాలు లేవన్నారు. ప్రభుత్వం నుంచి ఇళ్ళ పట్టాలు అందుకున్న ప్రజలంతా ఏక కాలంలో ఇళ్ళు నిర్మించుకోవండం ద్వారా నిర్మాణ సామగ్రి తక్కువ ధరకు లభిస్తాయన్నారు.దీంతో పాటుగా స్థానికంగా ఉంటున్న ఎక్కువమందికి ఉపాధి అవకాశాలు వెల్లువలా వస్తాయన్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి తీసుకున్న గొప్ప నిర్ణయమని కలెక్టర్ వివేక్ యాదవ్ కొనియాడారు. ఒకే కాలంలో అటు ప్రజలకు ఆస్థులు పెరగడంతో పాటుగా, ఇటు ప్రభుత్వానికి ఆదాయ వనరులు పెరుగుతాయని అన్నారు. అందివస్తున్న అవకాశాలను లబ్ధిదారులు సద్వినియోగ పరుచుకోవాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు.
చిలకలూరిపేట శాసన సభ్యురాలు విడుదల రజని మాట్లాడుతూ మాటలు చెప్పి, చేతులు దులుపుకునే ప్రజా ప్రతినిధులు ఉన్న ఈ సమాజంలో పేద ప్రజల గురించి ఆలోచించి పనిచేసి చూపిన ఏకైక ముఖ్యమంత్రిని తాము కళ్ళారా చూస్తున్నామని అన్నారు. ఆయన నాయకత్వంలో తాను ఒక మహిళా శాసన సభ్యురాలుగా పని చేయడం గొప్పవరమన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కొనసాగిస్తున్న సంక్షేమ పధకాలే అందుకు నిదర్శనమన్నారు. నవరత్నాల్లో ఏ పధకం తీసుకున్నా ఆడిన మాట తప్పకుండా ప్రజలకు ఆ పధకాలు చేరేవరకు అహర్నిశలు శ్రమిస్తున్న ముఖ్యమంత్రికి తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి భాగస్వామిని అవుతానని అన్నారు. ఈ సందర్భంగా పసమర్రు ప్రాంతంలో అమలు చేస్తున్న ప్రభుత్వ సంక్షేమ పధకాలను శాసన సభ్యురాలు రజని వివరించి చెప్పారు. దీంతో పాటుగా ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పేదలందరికీ ఇళ్ళ నిర్మాణ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని అధికారులను కోరారు. లభ్ధిదారులకు కూడా త్వరితగతిన ఇల్లు కట్టుకొని సొంత ఇంటి యజమానులుగా మారాలని పిలుపు నిచ్చారు. అనంతరం సభా ప్రాంగణంలో లబ్ధిదారు మహబూబ్ బి అనే మహిళ స్థలం వద్ద సర్వమత ప్రార్ధనలు నిర్వహించారు.అనంతరం భూమిపూజ చేసి,నవధాన్యాలుచల్లి,నిర్మాణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఇళ్ళ నిర్మాణాల ప్రాంతంలోనే ప్రపంచ పర్యవరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటారు. సమీపంలో రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన మూడు బోర్లలో తొలి బోరును ఏర్పాటు చేసి, గృహ నిర్మాణాలకు అవసరమైన నీటి సౌకర్యాన్ని సంబధిత అధికారులు ఏర్పాటు చేయగా రాష్ట్ర గృహనిర్మాణశాఖ డైరెక్టర్ డాక్టర్,ఎన్ భరత్ గుప్తా, జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, చిలకలూరిపేట శాసన సభ్యురాలు విడుదల రజనిలు ప్రారంభించారు. చిలకలూరిపేట నియోజక వర్గంలోని పసుమర్రు గ్రామంలో 41.63 ఎకరాల భూమిని లే అవుట్ గా ఏర్పాటు చేశారు. మొత్తం 1773 మంది లబ్ధదారులకు ప్లాట్లు కేటాయించారు. ఇందులో తొలివిడతగా పిఎంఎవై - వైయస్ఆర్ (అర్భన్) – బిఎల్ సి పధకాల ద్వారా 1565 మంది పేదలు ఇల్లు నిర్మించుకునేందుకు గృహనిర్మాణశాఖ అధికారులు అనుమతులు మంజూరు చేశారు. మొత్తం నిర్మాణాలు,మౌలిక వసతులు కలిపి ప్రాజెక్ఠ్ ఖర్చు రూ. 2817.60 లక్షలు. ఇళ్ళ నిర్మాణ ప్రాంతంలో మొత్తం మూడు బోర్లు ఏర్పాటుకు అధికారులు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ఒక బోరును ఏర్పాటు చేసి,విద్యుత్తు సౌకర్యం కల్పించి భవన నిర్మాణాలకు నీటిని అందించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. విద్యత్తు ఏర్పాటుకు అంచనా ఖర్చు రూ.20.74 లక్షలు.
సభా కార్యక్రమానికి ముందు మీడియాతో రాష్ట్ర గృహనిర్మాణశాఖ డైరెక్టర్ డాక్టర్.ఎన్.భరత్ గుప్తా, గుంటూరు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, చిలకలూరిపేట శాసన సభ్యురాలు విడుదల రజని లు పేద ప్రజల కోసం ముఖ్యమంత్రి చేపట్టిన సంక్షేమ పధకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట సబ్ కలెక్టర్ శ్రీవాస్ నుపూర్ అజయ్, జిల్లా గృహ నిర్మాణశాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ వేణుగోపాలరావు, మున్సిపల్ కమీషనర్ రవీంద్ర, మన్సిపల్ ఛైర్మన్ రఫాని, మార్కెట్ యార్డు ఛైర్మన్ చిన్నా, తహాశీల్థార్ సుజాత, ఎమ్పీడివొ హేమలతదేవి, పలుశాఖల అధికారులు,ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.