శ్రీకాకుళం జిల్లాలో చిరు వ్యాపారులకు స్త్రీనిధి పథకం ద్వారా గ్రామ సంఘాలకు జగనన్న తోడు రుణాలు అందించుటకు ప్రణాళికలు సిద్ధం చేసామని జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్ధ ప్రాజెక్టు డైరక్టర్ బి.శాంతి శ్రీ తెలిపారు. ప్రతి గ్రామ సంఘంలో కనీసం 12 మంది చొప్పున 1581 గ్రామ సంఘాలలో సుమారుగా 18 వేల మంది లబ్దిదారులకు రూ.18 కోట్లు మంజూరు చేయుటకు చర్యలు చేపట్టామన్నారు. ఈ మేరకు శని వారం ఒక ప్రకటన జారీ చేస్తూ స్త్రీనిధి “జగనన్న తోడు “ రుణాలను ఈ నెల 8వ తేదీన సంక్షేమ క్యాలెండర్ లో ప్రకటించిన విధంగా ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభిస్తారని ఆమె తెలిపారు. అదే రోజున సభ్యుల ఖాతాలో సొమ్ము జమ చేస్తారని పేర్కొన్నారు. ఈ కరోనా కష్టకాలంలో చిరు వ్యాపారులను ఆదుకొనే నిమిత్తం స్త్రీనిధి ద్వారా జగనన్న తోడు రుణాలు అందజేయటం ఆనందంగా ఉందని ఆమె వివరించారు. శ్రీకాకుళం జిల్లాలో జగనన్న తోడు రుణం స్త్రీనిధి ద్వారా ప్రతీ సభ్యురాలికి రూ.10 వేలు చొప్పున 18 వేల మందికి సంఘాల ఖాతాకులో జమ చేయడం జరుగుతుందని చెప్పారు. రుణం జమ విషయం లబ్దిదారుని ఫోన్ కు అందుతుందని చెప్పారు. జగనన్న తోడు రుణం 12 వాయిదాలలో 11 శాతం వడ్డీతో కలిపి నెలకు రూ.890/-లు చొప్పున స్త్రీనిధికి లబ్దిదారులు చెల్లించ వలసి ఉంటుందని ఆమె వివరించారు. ప్రభుత్వం సున్నా వడ్డీ క్రింద చెల్లించిన వెంటనే సభ్యుల ఖాతాకు ప్రస్తుతం చెల్లించిన వడ్డీ జమ అవుతుందని పేర్కొన్నారు. సురక్ష పథకం క్రింద స్త్రీనిధి రుణం మొత్తానికి బీమా కవరేజ్ చేయడం జరుగుతుందని, బీమాతో కూడిన రుణంగా పరిగణిస్తామని శాంతి శ్రీ చెప్పారు.రూ.175 కోట్ల రుణాలు మంజూరు లక్ష్యం : 2021 -22 ఆర్ధిక సంవత్సరానికి జిల్లాలో వివిధ రకాలైన జీవనోపాధులు మెరుగు పరుచుటకు సుమారు 35 వేల మంది సభ్యులకు స్త్రీనిధి ద్వారా రూ.175 కోట్లు రుణాలు మంజూరు చేయుటకు లక్ష్యంగా నిర్ణయించటం జరిగిందని, ఇప్పటకే రూ.30 కోట్ల రుణాలకు ప్రతిపాదనలు అందాయని తెలిపారు. 2020-21 సంవత్సరంలో స్త్రీనిధి రుణాలు లక్ష్యం రూ.108 కోట్లు కాగా, రూ.120 కోట్ల రుణాలు మంజూరు చేసామని, రికవరీ శత శాతం సాధించి రాష్ట్రంలోనే శ్రీకాకుళం జిల్లా ప్రదమ స్థానంలో నిలిచిందని ఆమె వివరించారు. 48 గంటల్లో స్త్రీ నిధి రుణాలు : జగనన్న చేయూత పథకంలో స్త్రీనిధి ద్వారా 18 వందల మంది లబ్ధిదారులకు ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు, కిరాణా మొదలగు వ్యాపారాలు స్థాపించుటకు రుణాలు మంజూరు చేసి సభ్యులు ఆర్దికంగా నిలదొక్కుకొనే విధంగా స్త్రీనిధి రుణాలు కోరిన సభ్యులకు 48 గంటలలో మంజూరు చేయటం జరుగుతుందని శాంతి శ్రీ చెప్పారు.