కోవిడ్-19 మూడో వేవ్ విపత్తు పొంచిఉందన్న సంకేతాల నేపథ్యంలో కేసుల సత్వరం చేపట్టాలని జిల్లా కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లాస్థాయిలో కోవిడ్ మూడో దశను ఎదుర్కొనేందుకు సన్నద్ధతా చర్యల్లో భాగంగా కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనపై శనివారం సాయంత్రం కలెక్టరేట్‌లోని కోర్టుహాల్‌లో జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) కీర్తి చేకూరి, జాయింట్ కలెక్టర్ (సంక్షేమం) జి.రాజకుమారి తదితరులతో కలిసి కలెక్టర్ మురళీధర్‌రెడ్డి ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కోవిడ్ కేసుల గుర్తింపు.. ఆపై నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన అన్ని మౌలిక వసతులను గ్రామ స్థాయి నుంచే పటిష్టపరచేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరముందన్నారు. చిన్నారులకు మూడోదశలో ముప్పు ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో చిన్నపిల్లల వైద్య నిపుణులతో సహా వివిధ వైద్య విభాగాల నిపుణులు, జిల్లా వ్యాప్త వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో కలెక్టర్ చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలోనూ సామాజిక ఐసోలేషన్ కేంద్రాల (ఎస్ఐసీ)ను ఏర్పాటుచేయడం ద్వారా వైరస్ వ్యాప్తి ఉద్ధృతికి అడ్డుకట్ట వేయడంతో పాటు తక్షణ వైద్య సహాయం అందించవచ్చని, ఈ దిశగా చేయాల్సిన ఏర్పాట్లపై నివేదికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఏఎన్ఎం స్థాయిలోనే ఐసోలేషన్ కిట్లు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.
మూడో వేవ్‌పై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించేందుకు ప్రణాళికలు రూపొందించాలని, ముఖ్యంగా భావి పౌరుల ఆరోగ్య భద్రత ప్రతి ఒక్కరి బాధ్యతగా ప్రజలు గుర్తించేలా జనజాగృతి కార్యక్రమాలు నిర్వహించాలని స్పష్టం చేశారు. చిన్నారులు కోవిడ్ బారిన పడిన పరిస్థితుల్లో వారికి చికిత్స అందించే కేంద్రాలకు సమీపంలో తల్లులు ఉండేలా వసతి, ఇతర ఏర్పాట్లు చేయాలని, ఇందుకోసం ఇప్పటినుంచే కసరత్తు చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న, త్వరలో అందుబాటులోకి రానున్న పడకల్లో 10 నుంచి 15 శాతం పడకలను పూర్తిస్థాయిలో చిన్నారులకు వైద్య సేవలందించేలా సిద్ధం చేయాలన్నారు. మేజర్ ఆసుపత్రులతో పాటు ఏరియా ఆసుపత్రులు, సీహెచ్‌సీలు, ఇతర ఆసుపత్రుల్లో ఆక్సిజన్ లైన్లను ఏర్పాటుచేయడంతో పాటు అవసరమైన మౌలిక వసతులను అభివృద్ధి చేయాలని, ఇందుకోసం టెండర్ల ప్రక్రియను ప్రారంభించాలని ఆదేశించారు. కోవిడ్ మానిటరింగ్ ప్రొఫైల్ పరీక్షల నిర్వహణకు అదనపు ల్యాబ్ సామగ్రిని సిద్ధం చేసుకోవాలన్నారు. సీపీఏపీ, హెచ్ఎఫ్ఎన్‌సీ, పీడియాట్రిక్ సెంట్రల్, పీఐసీసీ లైన్స్ వంటి వాటి ఏర్పాటు ద్వారా పీడియాట్రిక్ ఐసీయూలను బలోపేతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
ఇంకా కలెక్టర్ ఏమన్నారంటే..
- గ్రామ, వార్డు సచివాలయ స్థాయిలో ఫీవర్ సర్వేను అత్యంత కచ్చితత్వంతో నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలి. దీర్ఘకాలిక వ్యాధులు, మానసిక సమస్యలతో బాధపడుతున్న చిన్నారుల వివరాలు సేకరించాలి.
- కంటైన్‌మెంట్ జోన్ల వ్యవస్థను ఆధునికీకరించి, కరోనా కట్టడికి వ్యూహాలు రూపొందించాలి. సామాజిక ఐసోలేషన్ కేంద్రాలు, కంటైన్‌మెంట్ జోన్ల నిర్వహణ వంటి వాటికి మార్గదర్శకాల రూపకల్పనపై కసరత్తు చేయాలి.
- అంగన్‌వాడీ కేంద్రాల సిబ్బందికి కోవిడ్ మేనేజ్‌మెంట్‌పై శిక్షణ తరగతులు నిర్వహించాలి. ఇందుకోసం మాడ్యూళ్లను రూపొందించాలి.
- చిన్నారుల్లో వ్యాధినిరోధక సామర్థ్యం పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి.
- వాలంటీర్ల ద్వారా స్లిప్‌ల పంపిణీ విధానం ద్వారా వ్యాక్సినేషన్ ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలి. మొదటి, రెండోదశ కోవిడ్ కేసుల వ్యాప్తి ఆధారంగా హాట్‌స్పాట్‌లను గుర్తించి, ఆయా ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన టీకా కార్యక్రమం పూర్తయ్యేలా చూడాలి.
- కోవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స కోసం నిర్దేశించిన ప్రత్యేక ఔషధాలు 24X7 అందుబాటులో ఉండేలా చూడాలి.
- కోవిడ్ వైద్య సేవలు అందించడంలో మెరుగైన పనితీరును కనబరచిన వాటిని మాత్రమే నోటిఫై ఆసుపత్రులుగా ప్రకటించాలి. నిబంధనలు ఉల్లంఘించకుండా పటిష్ట నిఘా ఉండేలా చూడాలి.
- డా. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదలకు ఉచితంగా, ఎలాంటి వివక్షా లేని కోవిడ్ సేవలు అందించేలా చూడాలి.
- అవసరం మేరకు వైద్య, ఆరోగ్య సిబ్బంది నియామకానికి చర్యలు తీసుకోవాలి. వాకిన్ల ద్వారా వెంటనే నియామకాలు పూర్తయ్యేలా చూడాలి.
- 108 అంబులెన్సులు, ప్రైవేటు అంబులెన్సులను అవసరమైన వారికి తక్షణమే అందుబాటులో ఉంచేందుకు ఏకీకృత విధానం అమలుపై దృష్టిసారించాలి.
సమావేశంలో జీజీహెచ్ కోవిడ్ నోడల్ అధికారి సూర్యప్రవీణ్‌చాంద్, డీఎంహెచ్‌వో డా. కేవీఎస్ గౌరీశ్వరరావు, ఆరోగ్యశ్రీ జిల్లా సమన్వయకర్త డా. పి.రాధాకృష్ణ, జీజీహెచ్ సూపరింటెండెంట్ డా. ఆర్.మహాలక్ష్మి, డీసీహెచ్ఎస్ డా. టి.రమేశ్‌కిషోర్, జీజీహెచ్‌లోని వివిధ వైద్య విభాగాల అధిపతులు తదితరులు పాల్గొన్నారు.