ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సంట్రేటర్లు వితరణ..
Ens Balu
2
Srikakulam
2021-06-05 14:32:49
శ్రీకాకుళం జిల్లాకు 50 ఆక్సిజన్ సిలిండర్లు, 50 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు అందజేసారు. ఈ మేరకు ఎంపీ జిల్లా కలెక్టర్ జె నివాస్ కు కలెక్టర్ క్యాంపు కార్యాలయం వద్ద శని వారం అందజేసారు. ఎంటర్ ప్రెన్యుయర్స్ ఆర్గనైజేషన్ –ఆంధ్ర ప్రదేశ్ విభాగం ఆరు జిల్లాలకు ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సంట్రేటర్లు అందించగా శ్రీకాకుళం జిల్లాకు కూడా అందించాలని పార్లమెంటు సభ్యులు కోరడంతో రూ.50 లక్షల విలువగల సామగ్రిని అందజేసారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జె నివాస్ మాట్లాడుతూ ఆక్సిజన్ సిలిండర్లు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు జిల్లాకు ఉపయోగకరం అన్నారు. కోవిడ్ సమయంలో ఇటువంటి సౌకర్యాలు అందించడం పట్ల అభినందించారు. ప్రజలకు సరైన సమయంలో వినియోగించుటకు అవకాశం కలుగుతుందని ఆయన చెప్పారు.పార్లమెంటు సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ కోవిడ్ సమయంలో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తాయన్నారు. ఆరోగ్య అవసరాలు ఇంకా అవసరమని గుర్తించామని దాంతో ఆరోగ్య సదుపాయాలు మెరుగుపరచాలని ప్రయత్నించామని చెప్పారు. ఎంటర్ ప్రెన్యుయర్స్ ఆర్గనైజేషన్ ముందుకు వచ్చి రూ.50 లక్షల విలువైన సామగ్రి అందించడం జరిగిందని పేర్కొన్నారు. అవసరమైన ప్రాంతాలకు పంపిణీ చేసి కోవిడ్ బాధితులకు ఆక్సిజన్ సౌకర్యం అందించాలని కలెక్టర్ ను కోరామని చెప్పారు. కోవిడ్ సమయంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని కోరారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, చేతులు తరచూ శుభ్రపరచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కరోనా మూడవ దఫా విజృంభించకుండా, జిల్లాలోకి ప్రవేశించకుండా ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేసారు. ఈ సందర్భంగా ఎంటర్ ప్రెన్యుయర్స్ ఆర్గనైజేషన్ కు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సీతంపేట సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్ధ ప్రాజెక్టు అధికారి సి.హెచ్.శ్రీధర్, జిల్లా అటవీ అధికారి సందీప్ కృపాకర్ గుండాల, ఇంటాక్ కన్వీనర్ కె.వి.జె.రాధాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.