పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత..


Ens Balu
3
Srikakulam
2021-06-05 15:35:04

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతని,  ప్రతీ ఒక్కరూ ఒక మొక్కను నాటాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రామకృష్ణ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శనివారం సాయంత్రం స్థానిక జిల్లా కోర్టుల సముదాయం ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఏర్పాటుచేసింది. ఈ కార్యక్రమానికి జిల్లా  ప్రధాన న్యాయమూర్తి ముఖ్యఅతిథిగా పాల్గొని, ఇతర న్యాయమూర్తులతో కలిసి స్వయంగా మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోర్టు సముదాయాల్లోని పరిసరాలను అందంగా తీర్చిదిద్దేందుకు మొక్కలను నాటడం పరిపాటి అని, అయితే పర్యావరణ దినోత్సవాన్ని పురష్కరించుకొని ప్రస్తుతం ఫల మొక్కలను నాటడం జరిగిందని అన్నారు. ముఖ్యంగా నేరేడు, జామ, ఉసిరి వంటి పలురకాల ఫల మొక్కలను తాము, తమ సిబ్బంది పాల్గొని నాటడం జరిగిందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణంలో సమతుల్యత లోపించడం వలన వాతావరణంలో అనేక మార్పులు సంభవించాయని,  తద్వారా ప్రతీ ఏడాది ఉష్ణోగ్రతల్లో రెండు డిగ్రీల పెరుగుతూ వస్తుందని ఆయన పేర్కొన్నారు. దీనికి మొక్కలను నాటి వాటిని సంరక్షించుకోవడమే ప్రధాన మార్గమని ఆయన సూచించారు. పర్యావరణం లోపించడం వలన ఢిల్లీ వంటి మహానగరాల్లో కాలుష్యం అధికమై చాలా మంది ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారని, అలాగే కరోనా వంటి పాండమిక్ సమయంలో ఆక్సిజన్ స్థాయి పడిపోవడం గమనించామని, ఇందుకు కాలుష్యమే కారణమని ఆయన వివరించారు. ప్రతీ ఒక్కరూ మొక్కలను పెంచుకోవడం వలన వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుందని, పచ్చదనాన్ని చూస్తే కళ్లకు అందంగా కనిపిస్తుందని చెప్పారు. ఆక్సిజన్ స్థాయిలను పెంచే ఇండోర్ ప్లాంట్స్ కూడా ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయని, వీలైతే వాటినైనా పెంచుకోవాలని ఆయన సూచించారు. స్వచ్ఛమైన గాలి, నీరు, ఆహార వదార్ధాలు ప్రకృతి నుండి లభించినవేనని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆయన చెప్పారు. అభివృద్ధి పేరుతో పచ్చని చెట్లను నరికివేస్తున్నారని, పంట పొలాలను లే అవుట్లగా మారుస్తున్నారని, అడవులు కనుమరుగైపోతున్నాయని వీటివలన పర్యావరణం లోపిస్తుందని ఆయన గుర్తుచేసారు.  ఇటువంటి తరుణంలో విజ్ఞతతో తమ పుట్టినరోజున, ఇతర సందర్భాలలోనైనా ప్రతీ ఒక్కరూ తమ పెరటిలో గాని లేదా సమీప ప్రాంతంలో  ఒక మొక్కను నాటాలని పిలుపునిచ్చారు.   పర్యావరణాన్ని రక్షించేందుకు తమ వంతు సహకారం అందించాలని జిల్లా ప్రజలను కోరారు.

          ఈ కార్యక్రమంలో సెకెండ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ టి.వెంకటేశ్వర్లు,  జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి కె.జయలక్ష్మీ, జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ ( స్పెషల్ మొబైల్ కోర్ట్ ) జి.లెనిన్ బాబు, ఫస్ట్ అడిషినల్ జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కె.రాణి, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ యస్.రమేష్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.